తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. ఎవరికి లాభం?

 

తెలంగాణలో ఎన్నికల నగారా మ్రోగింది. కేసీఆర్ సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందుగానే అసెంబ్లీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు తెరలేచింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేకపోవడంతో దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో మునిగిపోయాయి. తెరాస ఇప్పటికే 105 అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీ బిజీగా ఉంది. ఇక మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ కూడా ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్రచారం మొదలుపెట్టాయి. ఇలా దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల హడావుడిలో ఉన్నాయి జనసేన తప్ప.

జనసేన అసలు తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేక వైసీపీ లాగా ఏపీకే పరిమితమవుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని కాని.. తెలంగాణ గురించి ఇంతవరకు ఓ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా అసలు తెలంగాణలో జనసేన బరిలోకి దిగుతుందా? అంటూ అనుమానం వ్యక్తం చేసారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై స్పందించారు.

విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పవన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఎవరో పాలకులు చేసిన తప్పులకు ప్రజలెందుకు బలికావాలని అడిగారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై 4, 5 రోజుల్లో తేల్చేస్తామన్నారు. మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో పర్యటన ముగించాక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్న సమయంలోనే ముందస్తు ఎన్నికలొచ్చేశాయని పవన్ చెప్పారు. అంటే జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో దిగేది లేనిది ఓ 4, 5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నమాట.

అయితే ఒకవేళ తెలంగాణ బరిలో జనసేన దిగితే.. దానివల్ల ఎవరికి ప్రయోజనం? అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. జనసేన ఏపీలో ఎంతోకొంత ప్రభావం చూపగలదు కాని.. తెలంగాణలో ప్రభావం చూపడం కష్టమే. ఇంతవరకు పార్టీ నిర్మాణం కూడా జరగలేదు.. పవన్ తప్ప ప్రజలకి తెల్సిన నాయకులు లేరు.. అదీగాక అన్ని స్థానాల్లో బరిలోకి దిగే సరైన అభ్యర్థులు కూడా కష్టమే. దీంతో ఒకవేళ జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమైనా కొన్ని స్థానాల్లోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఆ కొన్ని స్థానాల్లో జనసేన గెలిచినా గెలవకపోయినా ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది. పవన్ వీరాభిమానులు, అలాగే కొందరు సెటిలర్లు జనసేన వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సెటిలర్ల చూపు మహాకూటమి వైపు ఉందనే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు జనసేన బరిలోకి దిగితే ఆ సెటిలర్ల ఓట్లు ఎంతోకొంత చీలే అవకాశముంది. ఇది తెరాసకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అంటే పవన్ తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే.. పరోక్షంగా తెరాస లాభం చేకూర్చినట్టే అవుతుందన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.