కర్ణాటక బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై పవన్...నాకు ముందే తెలుసు..

 

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో జేడీఎస్ పార్టీ కీలకంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో పొత్తుపెట్టుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి.. కాంగ్రెస్ కు మద్దతిచ్చిందనుకోండి. కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. బీజేపీ మాత్రం రాకూడదూ అన్న నేపథ్యంలో కుమార స్వామికి ఏకంగా ముఖ్యమంత్రి పదవినే ఆఫర్ చేశారు. దాంతో జేడీఎస్ కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. కానీ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది కాబట్టి.. బీజేపీ పెద్దలు చక్రం తిప్పారు. మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేయడానికి గవర్నర్ గారు అనుమతిచ్చేశారు. ఇక బీజేపీ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు.. బీజేపీ విపక్ష పార్టీలన్నీ మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు కర్ణటాకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... నెల రోజుల క్రితమే తాను కొంత మంది అధికారులను కలిసినప్పుడు తనతో ఈ విషయంపై పలు విషయాలు పంచుకున్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి 90లోపు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అన్నారని, వారి విధానాలు వారికి ఉన్నాయని...అవేంటో అందరికీ తెలుసని, దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. అంతేకాదు... దీనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే.. అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయి..ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని..దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులని నీరు గార్చుతూ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదని, టీడీపీ, వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాయని, అన్ని పార్టీలు బేరసారాలు చేస్తూనే ఉన్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కోరుకునే వారిలో తానూ ఒకరినని అన్నారు.