అమరావతిలో ఇల్లు అందుకే...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి సమీపంలో కాజా వద్ద  తన సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన భార్య అన్నా లెజినోవా, ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఆయన వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ జరిపించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...   మానాన్న పనిచేసిన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయండ చాలా సంతోషంగా ఉంది...ఇంటితో పాటు పార్టీ కార్యాలయం నిర్మించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అంతేకాదు ఇక్కడే ఎందుకు ఇల్లు కట్టుకోవాలని భావించారో కూడా వివరించారు. మంగళగిరి రాజకీయ కేంద్రంగా మారింది...నా రాజకీయ ప్రయాణంలో కీలక సమయం ఆసన్నమైంది.. ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకన్నానని చెప్పారు.అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు.

 

ఇంకా పవన్ ఇల్లు ప్రత్యేకతల విషయానికి వస్తే... రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక హంగులతో ఈ భవంతి నిర్మాణం ఉండబోతుంది. చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్థుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పనివారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్ లో మరో చిన్న మీటింగ్ హాల్ తో పాటు కిచన్, డైనింగ్ హాల్, బెడ్ రూములు తదితరాలు ఉంటాయని, ఆపై అంతస్థులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి, మిగతాదంతా ఖాళీగానే ఉంచనున్నట్టు తెలుస్తోంది.