కమల్ చేసినట్టు పవన్ చేసుంటే...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కమల్ కు తెలిసినంత కూడా తెలియదా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో..? కమల్ ను చూసి పవన్ ఏం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. గత నాలుగు నెలల నుండి కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ సంగతి తెలిసిందే కదా. గోరుతో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు అన్న సామెత ప్రకారం...ఇప్పుడు ఈ వ్యవహారం అలానే తయారైంది. రోజు రోజుకు కత్తి మహేశ్ రెచ్చిపోయి పవన్ పై కామెంట్లు చేయడం... దానికి పవన్ అభిమానులు కూడా రెచ్చిపోయి కత్తిని టార్గెట్ చేయడం జరగుతూనే ఉంది. ఒకపక్క కత్తి మహేశ్ పవన్ ఫ్యాన్స్ వల్లే తాను ఇలా చేస్తున్నాని చెబుతున్నాడు.. మరోపక్క పవన్ అభిమానులు మాత్రం... కత్తి మహేశ్ అలా మాట్లాడుతున్నందుకే మేము ఇలా మాట్లాడుతున్నామని అంటున్నారు. వెరసి... ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద రచ్చగా తయారైంది.

 

ఈ నేపథ్యంలోనే.. మొగ్గలోనే తుంచిపారెయ్యాల్సిన ఒక సమస్యను..మొదట్లోనే తుంచిపారేస్తే ఇంత పెద్ద రచ్చ జరిగి ఉండేది కాదు అని అంటున్నారు. దీనిలో భాగంగానే... కమల్ ను గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే.. గత కొద్దిరోజుల క్రితం ఆర్క నగర్ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా దినకరన్ గెలిచాడు. ఇక ఈ ఫలితాలపై స్పందించిన కమల్ హాసన్... అక్కడ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయి తమ జీవితాన్ని తామే సమస్యల్లో నెట్టుకున్నారని... ఈ ఓట్ల కొనుగోలుతో ఓ సారి ఎన్నికలు ఆగిపోయినా రెండోసారి కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదని... అధికార పార్టీ ఒక్కో ఓటుకి 6 వేల రూపాయలు ఇస్తే , స్వతంత్ర అభ్యర్థి 20 వేలు ఇచ్చాడని కమల్ చెప్పుకొచ్చారు. ఆ 20 వేలకు అమ్ముడుబోయిన ఓటర్లు బిక్షమెత్తినట్టే అని కమల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకేముంది....దినకరన్ భిమానులు ఎదురుదాడి మొదలుపెట్టారు. కమల్ మీద వ్యక్తిగత దూషణలకు దిగేశారు. ఇక ఎలాగూ రొచ్చులో చెయ్యి పెట్టాను...దానికి ప్రతి దాడి ఉంటుందని ముందే ఊహించి... ఎట్టిపరిస్థితుల్లోనూ రెచ్చిపోకండి అంటూ తన ఫ్యాన్స్ కి బహిరంగంగానే ప్రకటన చేశారు. దీంతో కమల్ చేసినట్టే పవన్ కూడా తన ఫ్యాన్స్ కు ఇలానే ముందే పిలుపు ఇచ్చినట్టైతే... వ్యవహారం ఇంత వరకూ వచ్చి ఉండదని అంటున్నారు. అలా కాకుండా...కత్తి మహేష్ విషయంలో పవన్ కళ్యాణ్.. దోబూచులాడుతూ వ్యవహరించకుండా... కత్తి మహేష్ జోలికి పోకండి అంటూ స్పష్టమైన ట్వీట్ ఒక్కటి చేసినా.. ఈపాటికి అంతా చల్లబడిపోయ్యేదని అంటున్నారు.