కాటమరాయుడి జిల్లాల్లో సినీ కాటమరాయుడి కాలినడక!

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు భలే పాప్యులారిటీ వస్తుంటుంది. అందుకు కారణం వాటి ప్రగతో, చారిత్రక నేపథ్యమో వగైరా వగైరానో కాదు! ఆ ప్రాంతాలకు కొందరు సెలబ్రిటీలతో వుండే లింకే! మరీ ముఖ్యంగా పాదయాత్రలు , చట్ట సభలకు పోటీ చేసే విషయంలో చాలా ప్రాంతాలు స్పెషల్ గా మారిపోతుంటాయి! ఇప్పుడు ఆ వంతు అనంతపురానికి వచ్చింది!

 

కాటమరాయుడు పవన్ కళ్యాణ్ కి అనంతపురం అంటే అనంతమైన అభిమానం. నిజానికి ఆయన తాజా చిత్రం కాటమరాయుడు పేరు కూడా ఆ జిల్లాల్లోని ప్రఖ్యాత కదిరి నరసింహ స్వామిదే! అయితే అనంతతో కేవలం సినిమాటిక్ లింక్ మాత్రమే పెట్టుకోవాలని పవర్ స్టార్ భావించటం లేదు. పొలిటికల్ గా కూడా అత్యంత వెనుకబడ్డ అనంతపురాన్నే తన ప్రస్థానానికి మూలంగా ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే అనంతపురం నుంచి తాను బరిలోకి దిగుతానని ప్రకటించేసిన కాటమరాయుడు వడివడిగా తన ప్రయత్నాలు మొదలెట్టినట్టు కనిపిస్తోంది. చాలా మంది రాజకీయ నాయకులు తలపెట్టినట్టుగానే పవన్ పాదయాత్రకి సిద్ధపడ్డాడు. అది తొలిసారిగా అనంతపురంలోనే మూడు రోజుల పాటూ నిర్వహించాలని అనుకుంటున్నాడు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు గాని... రోడ్ మ్యూప్, రూట్ మ్యాప్ రెండూ సిద్ధమవుతున్నాయట!

 

కాటమరాయుడు విడుదలై కాస్త గ్యాప్ దొరికింది కాబట్టి ఇప్పుడే పవన్ అనంతపురంలో పర్యటించి తన పొలిటికల్ గేమ్ ప్రారంభించనున్నారు. మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా ఊపందుకుంటే కొన్నాళ్లు ఆయన రాజకీయాలకు దూరంగా వుండాల్సి వస్తుంది. అందుకే, ఒకప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు బాలయ్య కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం వున్న అనంతపురం నుంచే పవన్ తొలి అడుగులు వేస్తున్నాడు. టీడీపీకి కూడా ఎన్టీఆర్, బాలయ్య పోటీ చేయటంతో అనంతపురం సెలబ్రిటీ డిస్ట్రిక్ గా మారిపోయింది. ఇప్పుడు పవన్ స్పెషల్ ఫోకస్ తో జనసేన కార్యకర్తలు , ఆయన అభిమానులకి కూడా అనంతపురం హాట్ స్పాట్ గా మారిపోనుంది!

 

పాదయాత్రల వల్ల చంద్రబాబు, చిరంజీవి, వైఎస్ లాంటి నేతల ప్రత్యేక దృష్టి వల్ల ఫేమస్ అయిన మరి కొన్ని ప్రాంతాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వున్నాయి. ఉధాహరణకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, తెలంగాణలోని చేవెళ్ల ఇదే కోవకు వస్తాయి! మరి పవన్ పాదయాత్రతో అన్నా అనంతపురం కళ్లలో ఆనందం తాండవిస్తుందా? కరువు కోతతో అల్లాడే జిల్లా వికసిస్తుందా? వేచి చూడాలి. లేదంటే, జనసేనాని వచ్చే ఎన్నికల్లో అక్కడ్నుంచే అసెంబ్లీకి వచ్చి అనంత కష్టాల్ని తీర్చే ప్రయత్నం చేయాలి! ప్రజలు కోరుకునేదైతే అదే!