వర్మ తరువాత పవన్ ను టార్గెట్ చేసిన మరో దర్శకుడు!

 

పవన్ కళ్యాణ్ , ప్రత్యేక హోదా ... ఈ రెండూ ఇప్పుడు జంట పదాలైపోయాయి! పవర్ స్టార్ ఎక్కడికి వెళ్లినా స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తున్నాడు.ఇక పవన్ పోరాటానికి, ఆరాటానికి ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతా ఆయనకు మద్దతు తెలిపిన వారే. అప్పుడప్పడూ వర్మ వేసే సెటైర్లు తప్ప పవన్ కి ఇంత కాలం వ్యతిరేకత ఎదురు కాలేదు. కాని, తాజాగా ఇండస్ట్రీలోని ఓ సీనియర్ పవర్ స్టార్ పై విమర్శలు గుప్పించారు. మాటలు కాదు పోరాటాలు చేయమంటూ డైరెక్టగానే చురకలు వేశారు!

 

తమ్మారెడ్డి భరద్వాజా సినిమా పరిశ్రమలో రాజకీయ వ్యాఖ్యలకి ఫేమస్. ఆయన సినీ కార్మికుల బాగోగులు మొదలు రాష్ట్ర, దేశ సమస్యల గురించి స్పష్టంగా స్పందిస్తుంటారు. ఆయనలాగా సూటిగా విమర్శలు చేసే సినిమా సెలబ్రిటీలు అరుదు. కాని, ఈసారి పవన్ ని టార్గెట్ చేసిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో మాటలు సరిపోవని అన్నారు. పవన్ జనవరి 26న వైజాగ్ కు రానేలేదని అన్నారు. సంపూర్ణేష్ బాబు సైతం అక్కడికి వచ్చి అరెస్ట్ అయ్యాడని... కాని, పవన్ మాత్రం యూత్ కు పిలుపునిచ్చి మిన్నకుండిపోయాడని విమర్శించారు.

 

హోదా సాధ్యం కాదని ఇప్పటికే కేంద్రం మంత్రులు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు లాంటి వారంతా చెప్పేశారనీ... అయినా పదే పదే పవన్ హోదా ఎందుకివ్వరని ప్రశ్నించటంలో అర్థం లేదని కూడా తమ్మారెడ్డి అన్నారు. పవన్ ఇప్పటికైనా హోదా కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగాలని ఆయన సూచించారు. అయితే, నిన్న మొన్నటి వరకూ వర్మ ఒక్కడే పవన్ పైన ట్వీట్ లు చేస్తూ విమర్శలు చేసేవాడు. కాని, ఇప్పుడు తమ్మారెడ్డి కూడా తోడవటం పవన్ దృష్టి పెట్టాల్సిన విషయమే. 2019లోపు మరిన్ని గళాలు సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ కు వ్యతిరేకంగా వినిపించవచ్చు!