జనసేనాని సభలకి జనం తగ్గిపోతున్నారా?

 

రాజకీయ రంగం అందరికీ ఉద్దేశించింది కాదు. అందరూ మోదీ లాగా టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశ క్యాపిటల్ సిటీ దాకా ఎదగలేరు. కొందరికి వారసత్వం కలిసి వస్తుంది. రాహుల్ గాంధీ, అఖిలేష్ లాంటి వారు అలా నెట్టుకొస్తుంటారు. అయితే, స్వయం శక్తితో వచ్చేవారు, వారసత్వంతో నెగ్గుకొచ్చేవారు... ఈ ఇద్దరూ కాకుండా మరో రకం కూడా మన ఇండియన్ పాలిటిక్స్ లో వుంటారు! వారే సినిమా వారు! మామూలు వారికి ఎంతో కష్టపడితే తప్ప దక్కని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ వీరికి అమాంతం దొరికిపోతుంది. మరీ ఫాలోయింగ్ వుంటే స్వంత పార్టీ పెట్టి సీఎంలు కూడా అవుతుంటారు. కాని, సినిమా గ్లామర్ ఐస్ క్రీమ్ లాంటిది! ఎంత తియ్యగా, చల్లగా వుంటుందో... అంతే త్వరగా కరిగిపోతుంది, మురిగిపోతుంది కూడా...

 

టాలీవుడ్లో పవర్ స్టార్ పవరేంటో మనకు తెలియంది కాదు. అందుకే, ఆయన ప్రజా రాజ్యం కోసం ప్రజల్లోకి వచ్చినా, తరువాత జనసేన అంటూ జనంలోకి వచ్చినా, మోదీ, బాబు జోడీకి ఓట్లు వేయమన్నా అభిమానులు ఎగబడ్డారు. అధికారం కట్టబెట్టారు. ఆంద్రా సీఎం, ఇండియా పీఎం విజయంలో ఖచ్చితంగా పవన్ వాటా కూడా కొంత వుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, రాను రాను పవన్ పొలిటికల్ పవర్ తగ్గుతోందా? ఇదేం ప్రశ్న అంటారా? అవును, ఇంత వరకూ పవన్ పోటీనే చేయలేదు. ఆయన జనసేన జనంలోకి ఓట్ల కోసం వెళ్లనే లేదు. మరి ఆయన రాజకీయ ఛరిష్మా తగ్గుతోందని ఎలా అనగలం?

 


పవన్ చేనేత సత్యాగ్రహంలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఆయన స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని చెప్పేశారు కూడా. జనసేన నిర్మాణం కూడా జరుగుతుందని, అందుకోసం గన్నులకి, ట్యాంకర్లకి ఎదురు నిల్చిపోరాడే దమ్మున్న నాయకులు కావాలని అన్నారు. పైగా వాళ్లు జనం నుంచే వస్తారని తన ఉద్దేశం చెప్పకనే చెప్పారు. పవన్ జనసేన నాయకులుగా కొత్తవార్ని రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది చాలా మంచిది కూడా. ఎప్పుడైనా ఒక కొత్త తరం నాయకత్వం జనం ముందుకి వస్తే గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి.

 

చేనేత సత్యాగ్రహం సందర్భంగా పవన్ వ్యాఖ్యల్ని ఆయన అభిమానులు ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. అయితే, ఆందోళనంతా పవన్ క్రేజ్ ఒకప్పటిలా ఇప్పుడు కూడా వుందా అనే! చేనేత సత్యాగ్రహం సభనే తీసుకుంటే దానికి ఇరవై వేల మంది వస్తారని అంచనా వేశారు. కాని,రెండు నుంచి మూడు వేల మంది కూడా రాలేదని అంటున్నారు. అందులోనూ చాలా మంది నాగార్జున యూనివర్సిటి విద్యార్థులే వున్నారని కూడా చెబుతున్నారు! ఇలా ఒక్కసారి జరిగింది కాబట్టి పవన్ మేనియా తగ్గిపోయిందని మనం చెప్పలేం. కాని, ఒకప్పుడు వున్నంత ఇంట్రస్ట్ ఇప్పుడు పవన్ పొలిటికల్ సభలపై జనానికి వుండటం లేదన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే!

 

పవన్ ప్రత్యేక హోదా విషయంలో చేస్తున్న పోరాటం, అలాగే, ఆయన కమ్యూనిస్టు పార్టీలకి దగ్గరవుతున్నారనే అనుమానం, మెడలో ఎర్ర కండువా వేసుకుని స్పీచ్ లు ఇస్తుండటం... ఇలాంటివన్నీ ఆయన్ని ఒక వర్గం యూత్ కి దూరం చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. బీజేపికి, మోదీకి అనుకలంగా వుండే నెటిజన్స్ ఇప్పటికే పవన్ వైపు నుంచి తప్పుకున్నారని అంటున్నారు క్రిటిక్స్. సినిమాల పరంగా పవర్ స్టార్ అభిమానులు అయినా రాజకీయాల్లో పవన్ తీసుకుంటున్న లెఫ్టిస్ట్ స్టాండ్ కొందరికి నచ్చటం లేదట. దీన్ని కూడా పవన్ దృష్టిలో పెట్టుకుని రైట్ కో, లెఫ్ట్ కో పరిమితం కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా తన పంథా కొనసాగిస్తే ముందు ముందు ఎన్నికల బరిలో మంచి రిజల్ట్స్ వుంటాయి. లేదంటే, జనానికి కన్ ఫ్యూజింగ్ సిగ్నల్స్ పంపితే చిరుకి ప్రజా రాజ్యంతో ఎదురైన అనుభవమే కళ్యాణ్ బాబుకి కూడా ఎదురవ్వచ్చు!