మేడే.. పవన్ ఆమరణ నిరాహార దీక్ష..!


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆమర నిరాహార దీక్షకు సైతం సిద్దమయ్యారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం, విభజన హామీలు నెరవేర్చేందుకు, ఆమరణ దీక్షకు కూడా వెనుకాడనని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే దీనిపై పలు వార్తలు రాగా.. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... ఏప్రిల్‌ 4,5,6 తేదీల్లో విజయవాడలోనే ఉండి.. ఆమరణదీక్ష విషయమై ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయసేకరణ చేయబోతున్నారట. ఆందోళనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కలిసి వచ్చే అన్ని స్వచ్చంద సంఘాల మద్దతు కూడగట్టుకుని వెళ్లాలని భావిస్తున్నారుట. అన్నీ కుదిరితే ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే ఒకటో తేదీ (మే డే) నుంచి ఆందోళనకు దిగాలని భావిస్తున్నారట. విజయవాడ కేంద్రంగా జనసేనాని దీక్షకు దిగితే ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామ స్ధాయిలో కూడా అభిమానులు, కార్యకర్తలు దీక్షలకు దిగేలా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. దీనిపై విజయవాడలో జరిగే వరుస భేటీల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.