కమల్, పవన్ సీఎంలు కావాలని కోరుకుంటున్న హీరో...!

 

పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ ఇద్దరూ సీఎంలు అయితే ఎలా ఉంటుంది. అవ్వడం కష్టమైన పనే కానీ.. వినడానికి మాత్రం చాలా బావుంది కదా. పవన్ కళ్యాణ్ అభిమానులకు, కమల్ హాసన్ అభిమానులకు ఎలాగూ ఈ కోరిక ఉంటుంది. కానీ ఇక్కడో హీరో కూడా వారిద్దరూ సీఎం కావాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఆయన ఎవరో కాదు... సీనియర్ నటుడు నరేశ్‌. కమలహాసన్, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది అభిమానులు, ప్రజలు కలలుగంటున్నారని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఒకవేళ కమల్, పవన్ లు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయితే నందమూరి తారకరామారావు, ఎంజీఆర్ ల శకాన్ని మళ్లీ చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ తో పాటు కమల్ తో కలిసి తాను దిగిన ఓ ఫొటోను నరేశ్ పోస్ట్ చేశారు. ఆ ఫొటోపై పవన్ నవ్వుతున్న చిన్నసైజ్ ఫొటో ఉండటం గమనార్హం. ఇక నరేశ్ ట్వీట్ పై స్పందిస్తున్న నెటిజన్లు, కమల్, పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి నరేశ్ కు కూడా పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..