అర్ధరాత్రి రమ్మన్నారు....మీ పాపం అందరికీ పంచుతారా...!

 

ఇప్పటికే టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ రచ్చ లేపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో బాంబు పేల్చారు. ఏపీ ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశానికి పవన్ ను కూడా ఆహ్వానించారు చంద్రబాబు. కానీ తాను మాత్రం ఈ సమావేశానికి రానని చెప్పేశారు పవన్. అంతేకాదు దీనిపై ఓ లేఖ విడుదల చేస్తూ మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ హాజరు కాకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు.

 

"ఏదైనా పనికి సంకల్పం బలంగా ఉంటేనే ఫలితం గొప్పగా  ఉంటుందంటారు మన  పెద్దలు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి అటువంటి సంకల్పమే లోపించింది. సోమవారం సంధ్య ముగిసేవేళ, నిశిరాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రా..రమ్మని అనుచరులతో ఆయన కబురు పంపారు. తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి, చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు. ఈ సమావేశం నిర్వహణను కేవలం 'తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ'గానే జనసేన భావిస్తోందని అన్నారు.

 

అఖిల పక్ష సమావేశం ఇప్పుడు కాదు, మూడేళ్ల క్రితం పెట్టాల్సిందని... తిలా పాపం తలా పిడికెడు అనే పద్ధతిలో మీ పాపంలో అందరికీ భాగం పంచుతారా.. తన పాపాలను అందరికీ పంచేందుకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలను వంచించే ఏ చర్యనైనా జనసేన వ్యతిరేకిస్తుందని..హోదాతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారని.. అందుకే తాము అఖిల పక్ష సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మొత్తానికి మరోసారి పవన్ చంద్రబాబుకు రివర్స్ అయ్యారు. మరి ఇప్పటికే పవన్ పై మండిపడుతున్నటీడీపీ నేతలు ఇప్పుడు పవన్ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి..