కేసీఆర్, పవన్ టార్గెట్ చంద్రబాబే!

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత స్నేహితులు వుండరన్నది నూటికి నూరు శాతం వాస్తవం. రెండేళ్ళ క్రితం వరకూ పవన్ కళ్యాణ్ పేరు కూడా గుర్తులేని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు ఎందుకయ్యాడూ అంటే.. దానికి కారణం కేవలం రాజకీయమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేన్నర ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి తెలంగాణకు చెందిన ఎంతోమంది సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన వాళ్ళు కూడా అందులో వున్నారు. అయితే వారెవరికీ రాని అపాయింట్‌మెంట్ ఇప్పుడు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్‌కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని పబ్లిగ్గా చెప్పిన పవన్ కళ్యాణ్‌ని మొన్న జనవరి ఒకటిన కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకుని చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియనట్టు వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ఆయనతో చిన్నప్పటి స్నేహితుడి మాదిరిగా మెలిగారు. గతంలో కేసీఆర్ అండ్ టీమ్ తనను దారుణంగా తిట్టిన విషయాలన్నీ మరచిపోయిన పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్‌తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. వీరిద్దరి మధ్య ఆకస్మాత్తుగా ఏర్పడిన సఖ్యతను చూసి తెలంగాణలోని రాజకీయ వర్గాలతోపాటు ఏపీలోని రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఊరకే కలవరు మహానుభావులు అన్నట్టుగా వీరిని ఆసక్తిగా గమనించాయి.

 

ఇంతకీ ఉరుములేని పిడుగులా వీరిద్దరూ ఎందుకు మీటయ్యారనేది కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విషయం. వీరిద్దరి మీటింగ్‌ వెనుక వున్నది ఇద్దరి మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహం కాదు... చంద్రబాబు మీద ఇద్దరికీ వున్న శత్రుత్వం. కేసీఆర్‌కి సహజంగానే చంద్రబాబు మీద శత్రుత్వం వుంటుంది. రాష్ట్రాన్ని నిలువునా చీల్చి ఆదాయం లేని ముక్కని చంద్రబాబుకు ఇచ్చినా ఆయన నిబ్బరంగా నెట్టుకొస్తున్నారు. బోలెడంత ఆదాయం వున్న హైదరాబాద్ తన చేతుల్లో వున్నా కేసీఆర్‌ వాగ్దానాలు చేయడం తప్ప మరేమీ ప్రగతి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అడపా దడపా చేస్తున్న విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్‌ని లైట్‌గా తీసుకుంటున్నారు. అలాగే 2019 ఎన్నికలలో అధికారం సంపాదించేయాలని కూడా పవన్ కళ్యాణ్ తహతహలాడుతున్నారు. అలా సంపాదించాలంటే చంద్రబాబును తగ్గించాలి. దానికున్న ఎన్నో మార్గాల్లో కేసీఆర్‌తో స్నేహంగా మెలగడం ఒకటి. చంద్రబాబును డౌన్ చేయాలంటే కేసీఆర్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఒకరి అవసరం మరొకరికి వుంది. అందుకే ఇద్దరూ కొత్త సంవత్సర ప్రారంభ  శుభవేళల్లో ఒక్కటయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో మంచి డైలాగులే కొట్టారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అద్భుతంగా వుందని, తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలో ప్రభుత్వం కూడా పనిచేయాల్సిన అవసరం వుందని అన్నారు. ఇలా కేసీఆర్‌ని పొగిడి చంద్రబాబు ప్రభుత్వాన్ని తగ్గించడం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సరే... వీరిద్దరి భేటీ వల్ల ఏయే ఉపయోగాలుంటాయో... వీరిద్దరి స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూద్దాం.