వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి దారుణ హత్య...

 

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో కర్నూలు జిల్లా అంతా కలకలం రేగుతోంది. వివరాల ప్రకారం... చెరకులపాడు నారాయణరెడ్డి పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన నంద్యాలకు వెళ్లి ఒక శుభకార్యంలో పాల్గొన్నారు. అక్కడి నుండి కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఆయనపై దాడి హతమర్చారు. ఆయన కోసం రామక్రిష్ణాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు దగ్గర మాటు వేసి మూడు ట్రాక్టర్లను రోడ్డు పక్కన ఉంచారు.

 

ఆయన వాహనం వస్తున్నట్లు తెలియగానే ఓ ట్రాక్టర్‌తో ముందునుంచి ఢ కొట్టగా మరో ట్రాక్టర్‌తో వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న లోయవైపు నారాయణరెడ్డి ప్రయాణించే వాహనం జారింది. ఇంతలో కల్వర్టు కింద మాటువేసిన వారంతా ఒక్క ఉదుటున బయటికి వచ్చి నారాయణరెడ్డికి రక్షణగా వెనుక వస్తున్న మరో వాహనంపైకి బాంబులు విసిరారు. దీంతో ఆ వాహనంలోని వారంతా పరారయ్యారు. నారాయణరెడ్డి ఉన్న వాహనం డోర్‌లు లాక్‌ కావడంతో ప్రత్యర్థులు పెద్ద బండరాళ్లతో అద్దాలు పగులగొట్టారు. నారాయణరెడ్డిని బయటకు లాగి తల, మెడపై వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఇంకా కారులోనే ఉన్న ఆయన అనుచరుడు సాంబశివుడు పారిపోవడానికి ప్రయత్నించగా... ఆయనను కూడా వెంటపడి నరికి చంపేశారు.

 

దీంతో ఇప్పుడు నారాయణ రెడ్డి హత్యపై వైసీపీ నేతలు అధికార పార్టీపై విమర్సలు గుప్పిస్తున్నారు. టిడిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని హత్యా రాజకీయాలు చేస్తోందని... వైసిపికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేక టిడిపి హత్యా రాజకీయాలను ప్రారంభించిందని అంటున్నారు. మరోవైపు ఈ హత్యా నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. మరోవైపు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా బంద్‌ కొనసాగుతోంది.