రేవంత్ రెడ్డిపై గెలిచిన నరేందర్ రెడ్డికి మంత్రి పదవి?

 

ఎంతటి బలమైన నాయకుడికైనా ఒక్కోసారి ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి నేతలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక దాదాపు అందరూ ఇదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఉంటారు. నిన్న వచ్చిన ఫలితాలలో ఒక్కరా? ఇద్దరా? ఎందరో సీనియర్ నేతలు ఓడిపోయారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హేమాహేమీలు ఓడిపోయారు. అసలు కొందరైతే ఓడిపోతామని ఊహించి కూడా ఉండరు. అలాంటి వారిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకరు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ రేవంత్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఆయనకు కొడంగల్ కంచుకోటని భావించారు. కానీ టీఆర్ఎస్ ఆ కంచుకోటలో రేవంత్ ని ఓడించింది.

టీఆర్ఎస్ కొడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రేవంత్ ని ఎలాగైనా ఓడించాలని పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించి నరేందర్ రెడ్డి.. రేవంత్ పై విజయం సాధించారు. రేవంత్ లాంటి బలమైన నేతను ఓడించడంతో నరేందర్ పట్ల టీఆర్ఎస్ సంతోషంగా ఉంది. అంతేకాదు ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి చెందిన నలుగురు మంత్రులు ఓడిపోయారు. వారిలో పట్నం మహేందర్ రెడ్డి కూడా ఒకరు. అన్న మహేందర్ ఓడిపోతే.. తమ్ముడు నరేందర్ మాత్రం బలమైన నేత మీదే గెలిచారు. దీంతో ఆయన అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. మరి రేవంత్ ని ఓడించిన నరేందర్ కి మంత్రి పదవి వస్తుందేమో చూడాలి.