పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ

 

 

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి.

అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది.


పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు.

ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు.

ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు.

ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి.

ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.