బడ్జెట్‌లో ఏపీ పరిస్థితి ఏంటీ..?

 

రెవెన్యూ లోటు.. రాజధాని నిర్మాణం.. పోలవరం.. జాతీయ స్థాయి సంస్థల నిర్మాణానికి నిధుల లేమి ఇలా మెడ మీద కత్తిలా ఎన్నో సమస్యలు ఎదుర్కోంటోంది ఆంధ్రప్రదేశ్. అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రానికి చేయూతను అందిస్తామని చెప్పిన నాటి మాటలు.. నీటి మీద రాతలే అయ్యాయన్నది మెజారిటీ ప్రజల మాట. బడ్జెట్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం.. ఆ తర్వాత నీరుగారిపోవడం గత నాలుగు సంవత్సరాలుగా ఇదే తంతు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి తెలుగుదేశం పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు.

 

విభజన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడం, ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు భర్తీ, హైకోర్టు విభజన, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు సక్రమంగా రాకపోవడం వంటి సమస్యలు.. ఎక్కడ వేసిన గంగోళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. మరి ఎన్నికల బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రత్యేకహోదా కోసం చంద్రబాబుతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు ప్రధానితో పాటు జైట్లీ దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లారు. స్పెషల్ స్టేటస్ సాధ్యం కాదని తేల్చిచెప్పినప్పటికీ.. కనీసం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని విన్నవించారు. పన్నుల రూపంలో కొద్దిగా ఆదాయం పెరిగినా రెవిన్యూలోటును స్వల్పంగా పూడ్చుకోవచ్చన్నది నిపుణుల భావన.

 

ఇక 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి సాగునీరు అందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రుల జీవనాడిగా పేర్కొనబడుతున్న ఈ ప్రాజెక్ట్‌కు గతేడాది కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించి కేంద్రం చేతులు దులుపుకోగా.. ఈ సారి ఏ మేరకు కనికరిస్తుందోనన్నది చూడాలి. విజయవాడ, విశాఖ నగరాలను మెట్రో నగరాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా రాష్టప్రభుత్వం ఈ రెండు సిటీల్లో మెట్రో రైలును ప్రవేశపెట్టాలనుకుంది. ఆరువేల కోట్ల రూపాయలు కావాల్సిన బెజవాడ మెట్రోకు గత బడ్జెట్‌కు 100 కోట్లు కేటాయించగా.. విశాఖ మెట్రోకు కేవలం లక్ష రూపాయలే కేటాయించారంటే.. ఏపీ పట్ల కేంద్రం ఎంత చిన్నచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

అటు విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన విద్యాసంస్థల నిర్మాణానికి కూడా గతేడాది ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో కాలం గడుపుతున్న పాలక మండళ్లు ఈ సారి బడ్జెట్‌పై ఆశగా చూస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తోన్న టీడీపీ-బీజేపీ శ్రేణుల మధ్య.. తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుండటంతో అది బడ్జెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.