జీవితాన్ని మార్చేసే - Pareto principle

జీవితంలో అందరికీ అన్నీ ఉండవు. అన్ని చోట్లా ఒకే తరహా ఫలితాలు రావు. ఈ విషయాలు మనకి తెలిసినవే! కానీ ఇలా వేర్వేరు ఫలితాల వెనక ఏదన్నా లెక్క ఉందా అన్న ఆలోచన కలిగింది ‘పేరెటో’ (pareto) అనే ఇటాలియన్‌ ఆర్థికవేత్తకి. మన జీవితంలో కనిపించే 80 శాతం ఫలితాలకు 20 శాతం కారణాలే ఉంటాయని ఆయన ఓ సూత్రం రూపొందించాడు. ఆ తర్వాత కాలంలో ఆయన పేరు మీదగానే ఈ సూత్రం pareto principle పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ సూత్రాన్ని కాస్త జాగ్రత్తగా పాటిస్తే మన జీవితాలే మారిపోతాయని ఓ నమ్మకం.

 


Pareto principleకి 80:20 rule అన్న పేరు కూడా ఉంది. ఏ రంగంలో చూసినా ఈ సూత్రం పనిచేస్తూ ఉంటుందని అంటారు. ఉదాహరణకు సంపదనే తీసుకోండి! మన సమాజంలో ఉండే సంపదలో 80 శాతం సంపద 20 శాతం మంది దగ్గరే కనిపిస్తుంది. సాఫ్టవేర్‌ రంగంలో 20 శాతం తప్పుల వల్లే 80 శాతం సమస్యలు తలెత్తుతాయని తేలింది. ఆఖరికి మన చుట్టూ జరిగే 80 శాతం నేరాలకి కారణం 20 శాతం మంది నేరస్తులే అని కూడా వెల్లడయ్యింది.

 

ఈ 80:20 సిద్ధాంతాన్ని పరిశ్రమలకి కూడా అన్వయించవచ్చు. ఆఫీసుల్లో వచ్చే 80 శాతం ఫలితాలకి అందులో పనిచేసే 20 శాతం మందే కారణం అవుతుంటారట. ఆ 20 శాతం మందినీ గుర్తించి ప్రోత్సహించడం, మిగతా కార్మికులని మరింత జాగ్రత్తగా నియంత్రించడం చేస్తే... మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈ pareto principleని తొలిసారిగా ఎప్పుడో 1896లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. కంప్యూటర్లు వచ్చాయి, ప్రపంచీకరణ జరిగింది. అయినా ప్రతి కొత్త రంగంలోనూ ఈ సిద్ధాంతం పనిచేయడం ఆశ్చర్యకరమే! అందుకే ఓ అడుగు ముందుకు వేసి అసలు ప్రకృతిలోనే ఈ సూత్రం ఇమిడి ఉందని అంటున్నారు. మన కంటి ముందు కనిపించే 80% పంటలకు కారణం, 20% విత్తనాలే అన్న వాదనా ఉంది.

 

ఇంత ప్రత్యేకమైన ఈ 80:20 సిద్ధాంతం మన నిజజీవితంలో కూడా ఉపయోగపడుతుందన్నది ఓ వాదన. ఉదయాన్న లేచిన వెంటనే మనం ఆలోచించే తీరు మిగతా రోజునంతా ప్రభావితం చేస్తుందట. ఏదన్నా పనిచేసే ముందు, ఆ పని ఎలా పూర్తిచేయాలా అని కాసేపు ప్రణాళిక వేసుకోవడం వల్ల 80 శాతం పని సులువుగా సాగిపోతుందట. ఏదన్నా నిర్ణయం తీసుకునేముందు అసలు మన ముందు ఉన్న ఎంపికలు (choices/ directions) ఏమిటి అని కాసేపు ఆలోచిస్తే... 80 శాతం సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందట. అంటే ఓ 20 శాతం పరిస్థితులను మనం జాగ్రత్తగా అదుపుచేయగలిగితే, 80 శాతం ఫలితాలు దక్కితీరతాయన్నమాట. ఇదేదో బాగానే ఉంది కదా!

 

- నిర్జర.