తెరాస ఎమ్మెల్యే అభ్యర్ధికి చేదు అనుభవం

 

కేసీఆర్ ఓ పక్క గెలుపై ధీమా వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాత్రం ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.నాలుగేళ్లలో ఏం చేసారని ఓట్లు అడగటానికి వచ్చారని ప్రజలు నిలదీస్తున్నారు.తాజాగా మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది.పంతంగి గ్రామంలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీ వద్దకు రాగానే, దళిత సంఘాలు, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపనచేసి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తిచేయలేదని, అసంపూర్తి భవనాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో గ్రామంలోని పలు సమస్యలపై నిలదీశారు.

ప్రభుత్వ సబ్సిడీ ట్రాక్టర్లు అమ్ముకున్నారని, గ్రామాభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆందోళనకారులను కూసుకుంట్ల సముదాయించే ప్రయత్నం చేస్తుండగా, అనుచరులు ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకారులపై విరుచుకపడ్డారు. ఇరువర్గాలు ఒకరినొకరు దూషించుకున్నారు. చొక్కాలు పట్టుకొని తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామకూడలివద్ద ప్రభాకర్‌రెడ్డి ప్రసంగిస్తుండగా, యువకులు, మహిళలు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మహిళలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని, లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆందోళనకారుల నిరసనల మధ్య ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.