పంచాయతీ ఎన్నికలు.. జనసేనకు తప్పవా కష్టాలు

 

ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాలి. కానీ ప్రభుత్వం జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తమ పార్టీకి భయపడే టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జనసేనకు పంచాయతీ ఎన్నికలు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జనసేన పార్టీ స్థాపించి సుమారు ఐదేళ్లు అయింది కానీ.. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో ముందే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. పవన్.. టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు కానీ.. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగడం జనసేనకు అంత మంచిదేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల గెలుపు గురించి పట్టించుకుంటారు.

టీడీపీ, వైసీపీ పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. గ్రామస్థాయి నుంచి కేడర్ ఉంది. మండల, నియోజకవర్గ స్థాయి నేతలున్నారు. వారు పంచాయతీ ఎన్నికలు పట్టించుకుంటారు. కానీ జనసేన పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉంది. గ్రామస్థాయిలో నిర్మాణం జరగలేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్టీ అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేయొచ్చు.. కానీ పంచాయితీలకు సాధ్యపడదు. అక్కడి లీడర్లు, అక్కడి కేడర్ కావాలి. ఇవ్వన్నీ చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు చేదు అనుభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. అలా అని జనసేన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనకు కష్టాలు తెచ్చిపెట్టాయిగా అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనసేన వీటిని ఎలా ఎదుర్కుంటుందో.