కొంపముంచిన వాట్సాప్‌.. నిలిచిపోయిన ఎన్నికలు!!

 

సోషల్ మీడియా వల్ల అప్ డేట్స్ ఎంతలా తెలుస్తాయో.. ఫేక్ అప్ డేట్స్ కూడా అంతలా తెలుస్తాయి. ఫేక్ అప్ డేట్స్ నే నిజమనుకొని ప్రజలు పప్పులో కాలేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈమధ్య ఫేక్ అప్ డేట్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్నికల రిజర్వేషన్ల జాబితా రాకముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే ఒక ఊళ్ళో కొంపముంచింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల జాబితా పేరుతో కొన్ని మెసేజ్‌లు వాట్సాప్‌ లో చక్కర్లు కొట్టాయి. అదే నిజమని నమ్మిన ఓ గ్రామంలో రెండు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం రంజిత్‌నాయక్‌తండాలో వెలుగు చూసింది. ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందే రిజర్వేషన్‌ జాబితా ఒకటి వాట్సాప్‌లో విస్తృతంగా తిరిగింది. తర్వాత రోజు అధికారులు అసలైన జాబితా ప్రకటించినా గ్రామస్థులు పట్టించుకోలేదు. వాట్సాప్‌ సమాచారం ఆధారంగా సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకొన్నారు. ఈ మేరకు నామపత్రాల దాఖలు చివరి రోజైన శుక్రవారం సర్పంచి అభ్యర్థితోపాటు ఆరుగురు వార్డు సభ్యుల అభ్యర్థులు పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లారు. రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రానికి అవకాశం వచ్చింది. లోనికి వెళ్లిన ఆరుగురు వార్డు సభ్యుల్లో ఇద్దరు కేటాయించిన రిజర్వేషన్లకు విరుద్ధంగా పత్రాలు సమర్పించడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఎస్టీకి రిజర్వు చేసిన వార్డు స్థానాల్లో బీసీలు వేయడానికి వీలులేదని చెప్పడంతో అవాక్కయ్యారు. తమ దగ్గర ఉన్న జాబితాలో బీసీలకు ఇచ్చారని వాదించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి. కేటాయించిన రిజర్వేషన్లను పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ప్రదర్శించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.