యుద్ధానికి మేం సిద్దమే.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పుల్వామా ఘటనపై తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తోందని ఇమ్రాన్‌ ఆరోపించారు. ఏ ఆధారాలు ఉన్నాయని పాక్‌ను దోషిగా చూపుతున్నారని ప్రశ్నించారు. మీరన్నట్లు నిజంగానే దాడిలో పాక్‌ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తుకు సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దానికి నేను హామీ ఇస్తున్నా.. కానీ భారత్ ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలను చూపలేదని అన్నారు. పాక్ పాత్ర ఉందంటూ ఆరోపణ చేస్తున్న భారత్ ఎటువంటి ఆధారాలు చూపకుండా పాక్‌ను నిందించడం సరికాదని హితవు పలికారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఓ దేశం ఇలా చేసింది, అలా చేసిందని మరో దేశం ఎలా చెప్పగలుగుతుందని.. ఓ జాతి మీద, ఓ దేశం మీద అన్యాయంగా ముద్ర వేస్తారా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.

భారత్ వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని ఇమ్రాన్‌ ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండని హెచ్చరించారు. భారత్ దాడి చేస్తే తాము తిప్పికొడతామని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభించడం మీ చేతుల్లో ఉండొచ్చని, కానీ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతిసామరస్యాలు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయని, ప్రశాంత సమయంలో దాడి చేయాల్సిన అవసరం తమకేంటని అన్నారు. పదే పదే పాకిస్థాన్‌పై ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.