మాటల బౌండరీలు సరే… చేతల సిక్సర్లు కొడతాడా?

పాకిస్తాన్ కు కొత్త ప్రధాని దొరికేశాడు. అయితే, ప్రపంచానికి కొత్త పాకిస్తాన్ లభిస్తుందా? అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెబుతున్నారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే, కొత్త పీఎం పోస్టులోకి వచ్చిన ఇమ్రాన్ అప్పుడే మాటలు మొదలు పెట్టాడు. ఆయన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే కొత్త సీసాలో పాత వైన్ అన్నట్టుగా భావన కలుగుతుంది. పైగా భారత్ లాంటి దేశాలు ఇమ్రాన్ సారథ్యం వహించే పాకిస్తాన్ తో జాగ్రత్తగా వుండాలని చెబుతున్నారు పొలిటికల్ పండితులు!

 

 

ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ఇరవై రెండేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది. 1996లో ఇమ్రాన్ దీన్ని స్థాపించాడు. తరువాత ఒక్క సీటు కూడా సాధించలేని స్థితి నుంచీ ఆయన పార్టీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది మెచ్చుకోవాల్సిన పరిణామమే. కానీ, ఇందులో అనేక ఆందోళనకర అంశాలున్నాయి. ముఖ్యంగా, ఇమ్రాన్ ఖాన్ ఎదుగుదల జనం మద్దతుతో ఏం కాలేదు. పాకిస్తానీలు కొందరు ఆయన ‘నయా పాకిస్తాన్’ నినాదానికి ఆకర్షితులై ఓటు వేసినా… ఇమ్రాన్ చెప్పినట్టు అవినీతి అంతం , ఆర్దిక అభివృద్ధి లాంటివి జరుగుతాయని ఎవ్వరూ భ్రమపడటం లేదు! పాక్ ఇప్పుడున్న స్థితిలో దాన్ని గాడిలో పెట్టడం చాలా కష్టం.

 

 

అందులోనూ ఇటు మిలటరీకి, అటు ఉగ్రవాదులకి అత్యంత ప్రియుడైన ఇమ్రాన్ ఖాన్ ఆ పని చేయటం మరింత అసాధ్యం. ఎందుకంటే, పాక్ బాగుపడాలంటే అక్కడ ఉగ్రవాదం, ఉగ్రవాదులు నశించాలి. అది చేయగలిగేటంత సత్తా ఇమ్రాన్ కు లేదు. ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన తాలిబన్ ఉన్మాదులకి ఆయన పార్టీ భారీ విరాళం ఇచ్చిందంటేనే… మనోడి నైతికత అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఇమ్రాన్ ను గెలిపించటంలో పాక్ మిలటరీ పాత్ర కూడా చాలా వుంది. దాన్ని నమ్ముకున్న ఇమ్రాన్ ఖాన్ భారత్ తో యుద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే పాకిస్తాన్ ఆర్దికంగా చితికిపోవటం తప్పనిసరి. కానీ, అలాంటిదేదో చేయకపోతే పాకిస్తాన్ మిలటరీ బాస్ లు ఇమ్రాన్ ఖాన్ ప్రశాంతంగా వుండనీయరు!

 

 

ఆర్మీ, ఉగ్రవాదుల సంగతి పక్కన పెడితే ఇమ్రాన్ ఖాన్ మాటల్లోనే ఆయన భవిష్యత్ వ్యూహాలు ధ్వనిస్తున్నాయి. అమెరికాను కాదని చైనాకు దగ్గరవుతోన్న దాయాది దేశం ఇప్పుడు మరింత దూరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబోయే పాక్ ప్రధానిగా… ఖాన్ అమెరికాకు అప్పుడే సూచనలిచ్చాడు. అమెరికా, పాకిస్తాన్ ల మధ్య సమమైన లబ్ధి వుండాలని పేర్కొన్నాడు. అంటే, పాక్ అమెరికాకు సాయం చేయటం ఎంతో వుంటుందో అంతే సాయం అగ్ర రాజ్యం కూడా పాకిస్తాన్ కు చేయాలన్నమాట. మరో రకంగా చెప్పుకుంటే అమెరికా భారత్ వైపు మొగ్గటం ఇమ్రాన్ కు ఇష్టం లేదు. కానీ, వైట్ హౌజ్ అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఇండియాను కాదని పాకిస్తాన్ వైపు వెళ్లే అవకాశాలు లేవు. అంటే, మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ మరింత చైనాకు దగ్గరై అమెరికాకు దూరం అవటం దాదాపు ఖాయం. అంటే, అది ఇండియాకు కూడా పరోక్షంగా ఇబ్బందికరమే!

 

 

అమెరికా గురించే కాదు, ఇండియాతో సంబంధాల గురించి కూడా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ గత పాకిస్తానీ పాలకుల మాదిరిగానే కశ్మీర్ గురించి మాట్లాడాడు. కశ్మీర్ సమస్య భారత్ అంతర్గత విషయమని ఇప్పటికే చాలా సార్లు భారత్ తేల్చి చెప్పింది. దాంట్లో కలుగజేసుకోవాలని ఇమ్రాన్ ఉత్సాహంగా వున్నాడు. అదే ఆయన ఉద్దేశం అయితే భారత్, పాకిస్తాన్ ల మధ్య అనుబంధం ఎంత మాత్రం బాగుపడదు. పైగా మిలటరీ మాటలు విని కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఇమ్రాన్ పెంచి పోషిస్తే అది మరింత దుష్ఫలితాలు ఇస్తుంది. దురదృష్టవశాత్తూ ఇమ్రాన్ మాటలు, రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలు చూస్తుంటే అదే నిజమయ్యేలా వుంది!

 

 

ఇంకా పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయని ఇమ్రాన్ ఖాన్ విలాసవంతమైన పీఎం నివాస గృహాన్ని పేదల కోసం హాస్పిటల్ గా మార్చేస్తానన్నాడు. అక్కడితో ఆగక గవర్నర్ల అధికారిక గృహాల్ని కూడా హోటల్స్ గా మార్చి దేశానికి ఆర్దిక వనరుల్ని అందిస్తానన్నాడు. ఇలాంటి మాటలు వినటానికి బాగానే వున్నా నిజంగా కార్య రూపం దాలుస్తాయా? దాల్చినా ఎంత ఉపయోగం వుంటుంది? మునిగిపోతున్న పాక్ ఆర్దిక రంగానికి ఇమ్రాన్ చెబుతోన్న మాటలు ఏ మాత్రం ఉపయోగపడతాయి? ఇలా బోలెడు ప్రశ్నలు! చూడాలి మరి… పాతాళం నుంచీ అధః పాతాళానికి వెళుతోన్న పాకిస్తాన్ ను ఇమ్రాన్ ఖాన్ పైకి తెస్తాడో లేదో! లేక మరింత కిందకు తోస్తాడో!