ఇక బ్యాటింగ్ ఇమ్రాన్ ఖాన్‌ది! భారత్ బౌలింగ్ ఎలా చేయాలి?

ఇవాళ్ల అంతర్జాతీయ మీడియా దృష్టంతా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపైనే వుంది. అనుకున్న విధంగానే ఇమ్రాన్ ఖాన్ గెలుపు దిశగా సాగిపోయాడు. ఒకప్పుడు పాకిస్తాన్ కు క్రికెట్ వాల్డ్ కప్ సాధించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికే కెప్టెన్ అవ్వనున్నాడు. ఇంత వరకూ ఓకే. కానీ, ఇవాళ్లే మరో ముఖ్యమైన విశేషం కూడా వుంది. అదే భారత్ లో జరిగే కార్గిల్ విజయ్ దివస్! ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ లో చాలా మంది రగిలిపోతుంటారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరు! ఆర్మీకి అత్యంత ప్రియుడైన ఈ టెర్రరిస్ట్ సపోర్టర్ కాశ్మీర్ తమదేనని అడ్డంగా వాదించే టైపే! నిజానికి అందుకే ఆయనంటే పాక్ మిలటరీకి బోలెడు ఇష్టం. నవాజ్ షరీఫ్ లా కాస్తో కూస్తో కూడా రాజకీయ చాతుర్యం వున్నా వాడు కాదు ఇమ్రాన్. పూర్తిగా మిలటరీ బాస్ లు చెప్పే మాటలకు జీ హుజూర్ అనే రకం! మరిక ముందు ముందు మన దేశం ఎలా వుండాలో ప్రత్యేకించి చెప్పాలా? అలెర్ట్ గానే వుండాలి!

 

 

భారత్, పాక్ వేరు వేరు దేశాలైనా గవర్నమెంట్ మార్పు జరిగితే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరి ప్రభావం వుంటుంది. అందుకే, పాకిస్తాన్ పాలకులు ఏదో మూలన కాంగ్రెస్ పాలన దిల్లీలో వుండాలని కోరుకుంటారు. అలాగే, ఇండియాలో నేరుగా ఆర్మీ పాలన కంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం పాలన వుండాలని మనం కోరుకుంటాం. మరీ ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నవాజ్ షరీఫ్ లాంటి నేతే పాకిస్తాన్ పీఎంగా వుండాలని ఆశించింది. కానీ, అలా జరిగే సూచనలు ఎంత మాత్రం లేవు. సరిగ్గా జరిగినా, జరగకపోయినా ఎన్నికల్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని అతనే అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇమ్రాన్ ప్రధాని అంటే పాలన నేరుగా ఆర్మీనే చేస్తోందని భావించాలంటూ విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.

 

 

పాక్ లో ప్రభుత్వ మార్పు సరే… ఇండియాలో 2014లో మోదీ వచ్చినప్పటి నుంచీ పక్క దేశానికి అసహనంగానే వుంది. ఎందుకంటే, యూపీఏ సర్కార్ హయాంలో కాశ్మీర్ లోనే కాదు భారతదేశం లోపల కూడా పాక్ అరాచకాలు హాయిగా సాగాయి. మోదీ ఇతర పథకాలు, నిర్ణయాలు ఎలా వున్నా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త అద్భుతమే! ఏకంగా ముంబై మహానగరంలో ఊచకోత కోసిన పాక్ ఇప్పుడు ఒక్క బాంబు పేల్చలేకపోతోంది ఇండియాలో. కేవలం కాశ్మీర్ లో రాళ్ల దాడి వ్యూహంతో కాలం గడుపుతోంది. దానికి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మన భద్రతదళాలు ఎన్ కౌంటర్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని హతం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కాలుపెట్టి ప్రతీకారం కూడా తీర్చుకున్నారు మన జవాన్లు. ఇలాంటి పరిస్థితి వల్లే పాక్ కు భారత్ లో ధృఢమైన ప్రభుత్వం వుండటం నచ్చదు. అదీ హిందూత్వ ఎజెండాతో సాగే బీజేపీ సర్కార్ అంటే పాక్ కు మరింత కలవరం.

 

 

2014 నుంచీ పాకిస్తాన్ కు మోదీ సర్కార్ మీద మంటగా వున్నా నవాజ్ షరీఫ్ లాంటి రాజకీయ నేత దేశాన్ని నడపటం వల్ల యుద్ద వాతావరణం తప్పుతూ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి పొలిటీషన్ అనుకోటానికి లేదు. తన మాజీ రెండో భార్య నుంచి అనేక ప్లేబాయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ అవసరాల కోసం పూర్తిగా పాక్ ఆర్మీకి అమ్ముడుపోయాడు. నవాజ్ షరీఫ్ ఆర్మీతో కాస్త దూరం పాటించటమే అతడి అరెస్ట్, ప్రస్తుత జైలు జీవితానికి కారణమన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి ఇమ్రాన్ ఆ తప్పు చేయకుండా మిలటరీ అధినేతల చెప్పుచేతల్లో తోకాడిస్తాడు.అంటే, భారత్ ఇమ్రాన్ రూపంలో పాక్ మిలటరీ కుట్రల్ని ఎదుర్కోటానికి సిద్ధంగా వుండాలన్నమాట. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన అంతిమ యుద్ధానికి కూడా ఇండియా తెగించే వుండాలి. తప్పదనుకుంటే పాక్ ను మోదీ మూడు ముక్కలు చేసైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇమ్రాన్ ఖానే సంయుక్త పాకిస్తాన్ కు చివరి ప్రధాని అయ్యేలా చూడాలి. అదే భారత్ మనః శాంతికి శాశ్వత పరిష్కారం!

Related Segment News