ఆ సమయంలో బయటకు వస్తే అంతే సంగతులు!

 

సాయంత్రం ఐదు గంటలకి రోడ్డు మీదకి వచ్చామంటే చాలు... అంగుళం కూడా రోడ్డు కనిపించకుండా, వాహనాలతో కిటకిటలాడిపోతుంటుంది. ఇలాంటి సమయంలో కాలుష్యం కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుసు. కానీ వాస్తవం అంతకంటే భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. సాధారణంగా కాలుష్యాన్ని గుర్తించే పరికరాలు రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తారు. కానీ కారులోనో, బస్సులోనో పరిస్థితి దీనికంటే మరింత భిన్నంగా ఉండవచ్చు. ఉక్కిపోయి ఉండే ఆ వాతావరణంలో కాలుష్యం మరింత తీవ్రంగా ఉండవచ్చు. అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకు ఇదే అనుమానం వచ్చింది. దాంతో వారు మనిషి ఊపిరితిత్తులను పోలిన పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని ఓ 30 కారులలో బిగించి చూశారు.

 

పరికరాలను బిగించన కార్లు మంచి రద్దీగా ఉన్న సమయాలలో ఊరిలో తిరిగాయి. ఊహించినట్లుగానే బయట ఉన్న కాలుష్యంకంటే కారులో ఉన్న కాలుష్యం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా కనిపించింది. కారు వేగం, కిటికీలు తీసి ఉంచడం... లాంటి పరిస్థితులేవీ పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా, కారులో ఉండేవారు బయటకంటే అధికకాలుష్యాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది.

 

కారులో కాలుష్యం అధికంగా ఉండటమే కాదు... అందులోని రసాయనాలు కూడా మరింత విషపూరితంగా ఉంటున్నట్లు తేలింది. ఈ రసాయనాల కారణంగా శరీరంలో oxidative stress అనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, గుండెజబ్బులు, కేన్సర్, నాడీసంబంధ వ్యాధులు లాంటి రకరకాల సమస్యలకి ఈ oxidative stress దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.... ఈ కాలుష్యం మన కణాలను, వాటిలోని DNAను సమూలంగా ప్రభావితం చేస్తాయి.

 

అదండీ విషయం! ప్రపంచంలోని నగరాలు చాలావరకు ఎలాంటి ప్రణాళికా లేకుండా కనిపిస్తాయి. ప్రత్యామ్నాయ రహదారులు లేకపోవడం, ఆఫీసులన్నీ ఒకేచోట ఉండటం, రద్దీకి తగినట్లుగా రోడ్లని వెడల్పు చేయకపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్టుకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి సవాలక్ష సమస్యలు ఈ నగరాలలో కనిపిస్తాయి. ఫలితంగా జనం కాలుష్యంతో విలవిల్లాడిపోతున్నారు.

 

ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు కొన్ని మార్గాలు లేకపోలేదు. రద్దీ తక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లే ప్రయత్నం చేయడం, వీలైతే మన ఆఫీసు పనివేళలను రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఎంచుకోవడం, రద్దీ తక్కువగా ఉండే మార్గాలలో ప్రయాణం చేయడం, రద్దీగా ఉండే రోడ్లకి కాస్త దూరంగా నివసించే ప్రయత్నం చేయడం.... లాంటి జాగ్రత్తలతో ఈ కాలుష్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు.

- నిర్జర.