పని తీరు అద్భుతం.. కోల్డ్ స్టోరేజ్ అవసరం లేని కరోనా వ్యాక్సిన్ రెడీ

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రయత్నాలలో కొన్ని సంస్థలు విజయం సాధించి ఉత్పత్తి వైపు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ లు వాటి సగటు సామర్థ్యం 95 శాతమని తెలిపాయి. అయితే ఫైజర్ టీకా విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పంపిణీ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు -70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవడమే ముఖ్య సమస్యగా నిపుణులు చెపుతున్నారు.

 

ఈ పరిస్థితుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సామార్థ్యానికి సంబంధించి అస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ ఈరోజు సోమవారం కీలక ప్రకటన చేసారు. కరోనాకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని అయన చెప్పారు. బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుండి చివరి దశ ట్రయల్స్ సమాచారం మేరకు ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఈ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది.

 

అయితే క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విషయంలో అధికారులు రెండు రకాల డోసులు వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు మొదట సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇవ్వగా.. వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. ఇక కరోనా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన రెండో విధానంలో ఈ వ్యాక్సిన్ ను కేవలం సగం డోసు వినియోగించగా దాని సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆస్ట్రాజెనెకా సీఈవో తెలిపారు. ఈ విధానం అన్నిటికంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని, వ్యాక్సిన్ విషయంలో ఇదే పద్దతి అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని అయన పేర్కొన్నారు.

 

అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఎన్ఏ ఆధారంగా రూపొందించిన మోడర్నా, ఫైజర్ టీకాలతో పోలిస్తే ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ సౌలభ్యం పరిగణలోకి తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్ టీకాయే భారత్ తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువైనదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మిగిలిన వ్యాక్సిన్ల తో పోలిస్తే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను సాధారణ రిఫ్రెజిరేటర్లలో కూడా నిలువ చేయగలగడం దీని ప్రధమానమైన అడ్వాంటేజ్ అని నిపుణులు అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్సఫర్డ్ టీకాయే తగినదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రెండు డోసులు కలిపి కేవలం రూ.1000లోపే లభ్యమయ్యే అవకాశం ఉంటడమనేది ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మరో సానుకూల అంశమని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ దేశాల వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందించి, త్వరగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా పేర్కొంది.