ఒవైసీ ప్రమాణం చేస్తుండగా.. 'జై శ్రీరాం' నినాదాలతో మారుమోగిన సభ!!

 

లోక్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఆయన తన స్థానం నుంచి లేవగానే.. 'జై శ్రీరాం, భారత్ మాతాకీ జై' అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆ నినాదాలను అసలు పట్టించుకోనట్టుగా.. గాల్లో చేతులు ఊపుతూ పోడియం దగ్గరికి వచ్చిన ఒవైసీ.. ప్రమాణం చేశారు. తన ప్రమాణాన్ని 'జై భీమ్.. అల్లాహు అక్బర్.. జై హింద్' అంటూ ముగించారు.

అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సభ్యులకు తనను చూడగానే అలాంటి విషయాలు గుర్తుకురావడం మంచిదేనని, అయితే వారు భారత రాజ్యాంగాన్ని, ముజ్‌ఫర్‌పూర్‌లో చిన్నారుల మరణాలను కూడా వారు గుర్తుకు తెచ్చుకుంటారని ఆశిస్తానని చురకలు అంటించారు.

కాగా, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గత రెండు వారాల్లో 200 మందికి పైగా చిన్నారులు మెదడువాపు వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. ముజఫర్‌పూర్‌లో చిన్నారుల మృతిపై విపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.​ మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్‌ స్ర్టైక్స్‌ను ఆర్జేడీ ప్రస్తావిస్తూ ఆ మెరుపు దాడులను చిన్నారులను కబళిస్తున్న మెదడువాపు వ్యాధిపై చేయాలని ఎద్దేవా చేసింది.