ఒక పరాజయం 100 తప్పులు.. నంద్యాల వాపును బలుపుగా భావించారా?

 

క్రికెట్ టోర్నమెంట్ లో.. లీగుల్లో, సెమీ ఫైనల్లో గెలిచాం కదా అని.. ఫైనల్లో అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా ఆడితే ఆ టీంకి ఓటమి ఎదురయ్యే అవకాశాలున్నాయి. సరిగ్గా టీడీపీ విషయంలో కూడా అలాంటి అతి విశ్వాసమే దెబ్బతీసింది అనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఆ ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. అలాంటి వాటిల్లో నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ఉన్నాయి. ఆ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. కానీ ఆ విజయం ఎలా దక్కిందన్నదే ప్రశ్న. 

ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అన్ని దారులు తొక్కిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ధన ప్రవాహం ఓ రేంజ్ లో జరిగిందని బహిరంగ రహస్యం. అంటే ఆ ఎన్నికల ఫలితాన్ని బట్టి బాబు సర్కార్ పై ప్రజలు సంతృప్తితో ఉన్నారో లేదో అంచనా వేయలేం. ఇక కాకినాడ మున్సిపల్ ఎన్నిక కూడా అక్కడ స్థానిక నేతల పనితీరు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి కూడా బాబు సర్కార్ పై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడం కష్టం. కానీ టీడీపీ మాత్రం ఈ రెండు విజయాలతో.. 2019 ఎన్నికల్లో కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా నంద్యాల ఉపఎన్నికల ఫలితాన్ని చూసి మాకు తిరుగులేదని అతి విశ్వాసానికి పోయింది. అదే కొంపముంచింది. నంద్యాల ఉపఎన్నికలో ప్రజల నిజమైన నాడిని తెలుసుకోకుండా.. టీడీపీ రకరకాల దారులు తొక్కి గెలిచిందని ఆరోపణలు వచ్చాయి. దానికితోడు ఆ గెలుపుని చూసి ఇక మాకు తిరుగులేదని భ్రమల్లో తేలిపోయిందని అంటున్నారు.