అతి వేగం ప్రాణాంతకం

పోలీసు కారు తనని వెంబడించడం చూడగానే ఆ చర్చి ఫాదరు ఒకసారి తన స్పీడోమీటర్‌ వంక చూసుకున్నాడు. పరిమిత వేగాన్ని మించి 20 కిలోమీటర్లు ఎక్కువగా వేగంతో తను బండిని నడుపుతున్నాడు. ఆ విషయం గమనించి పోలీస్‌ తనని వెంబడిస్తున్నాడని అర్థమైంది. దాంతో నిదానంగా తన కారుని పక్కకితీశాడు. తీరా పోలీసు కారులోంచి దిగిన వ్యక్తిని చూశాక ఫాదరుకి కాస్త ఉపశమనంగా తోచింది. వారం వారం చర్చిలో తన ఉపన్యాసం వినడానికి వచ్చే హేరిస్‌ని ట్రాఫిక్‌ పోలీస్ అవతారంలో చూసేసరికి భయం కాస్తా ఎగిరిపోయింది. హేరిస్‌ తనని కాస్త చూసీ చూడనట్లు వదిలిచేయవచ్చు. ‘‘హాయ్‌ హారిస్! మనం ఇలాంటి సందర్భంలో కలుసుకుంటామని అనుకోలేదు’’ అన్నాడు చర్చి ఫాదర్‌ సరదాగా. ‘‘నేను కూడా!’’ చాలా నిర్లిప్తంగా బదులిచ్చాడు హేరిస్‌.

 

‘‘ఇవాళంతా విపరీతమైన పని ఒత్తిడి. పైగా ఇంటికి వెళ్లేందుకు చాలా ఆలస్యం అయిపోయింది. ఇదిగో ఆ తొందరలో ఉండగానే నువ్వు నన్ను గమనించినట్లున్నావు’’ తన సంజాయిషీని తెలివిగా చెప్పుకొచ్చారు ఫాదర్‌. ‘‘ఊ!’’ అంటూ బదులిచ్చాడే కానీ హేరిస్‌ మొహంలో ఎలాంటి చిరునవ్వూ కనిపించలేదు. ‘‘అయినా నేనేమంత వేగంగా వెళ్లడం లేదు. మహా అయితే ఒక ఐదు కిలోమీటర్ల ఎక్కువ స్పీడుందేమో! ఏదో పరధ్యానంగా ఉండి పట్టించుకోలేదు,’’ అంటూ చటుక్కున చిన్న అబద్ధం చెప్పేశారు ఫాదర్‌.

 

హేరిస్‌ ఒక్క క్షణం ఫాదర్‌ మొహంలో చూశాడు. ‘‘మా వాడలో మీరు ఒక మంచి ఫాదర్‌ అన్న పేరు ఉంది,’’ అన్నాడు. హేరిస్‌ ఆ మాట ఎందుకు చెప్పాడో ఫాదర్‌కి అర్థం కాలేదు. కానీ ఇక అంతకు మించి అతనితో సంభాషణ అంత మంచిది కాదనిపించింది. నిదానంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. హేరిస్‌ ఎలాగూ చలాను రాసి ఇస్తాడు కాబట్టి, ఎంతో కొంత రుసుముని చెల్లించేందుకు జేబులో ఉన్న డబ్బులు తీసి లెక్కపెట్టుకోసాగాడు. ఓ రెండు నిమిషాల తరువాత హెరిస్ కారు అద్దంలోంచి చలాను లోపలకి పడేశాడు.

చలాను తీసి చూసుకున్న ఫాదర్‌కి అది ఏదో ఉత్తరంలా తోచింది. ‘‘ఫాదర్‌! ఒక నాలుగేళ్ల క్రితం ఇలాగే వేగంగా వెళ్తున్న కారు కింద పడి నా ఆరేళ్ల పాప చనిపోయింది. డ్రైవరు వేగంగా కారు నడిపినందుకు గాను అతనికి జరిమానా, మూడు నెలల జైలుశిక్ష విధించారు. అతను ఓ మూడు నెలలు కళ్లు మూసుకుని జైళ్లో గడిపేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో తన ముగ్గురు పాపాలతో అతను హాయిగా ఉన్నాడు. కానీ నేను నా ఒక్కగానొక్క కూతురిని కోల్పోయాను. నేను చనిపోతే కానీ స్వర్గంలో ఉన్న నా కూతురిని కలుసుకోలేనేమో! ఈలోగా నా కొడుకుని చూసుకుంటూ ఆ బాధని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాము. మీరు వేగంగా నడిపే కారు ఏదో ఒక రోజు నా కొడుకుని కూడా మా నుంచి దూరం చేయగలదు. దయచేసి మా కుటుంబం కాసం ఆ ప్రభువుని ప్రార్థించండి. మరో బిడ్డ చనిపోకుండా ఉండేందుకు మీ కారుని నిదానంగా నడపండి,’’ అని ఆ ఉత్తరంలో ఉంది.

 

ఫాదర్‌ నోట మాట రాలేదు. వాహనాన్ని వేగంగా నడపడం అనేది తనకు సరదానో, అవసరమో కావచ్చు... కానీ అది ఇంకొకరి కుటుంబాన్ని నాశనం చేయగలదన్న ఊహే చాలా భయంకరంగా తోచింది. తన కారుని నిదానంగా ముందుకు పోనిచ్చారుత. వచ్చే ఆదివారం చర్చిలో ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలని నిశ్చయించుకున్నారు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.