వందేళ్ల ఉస్మానియా… అక్కడ చదువే ఉద్యమం! ఉద్యమే చదువు!

 

విశ్వవిద్యాలయం… ఈ పేరులో విశ్వం ఎందుకు వుందో ఎప్పుడైనా ఆలోచించారా? విద్యార్థులు విద్యని అభ్యసిస్తారు కాబట్టి విద్యాలయం! కాని, విశ్వం ఎందుకొచ్చింది? ఇంగ్లీషులో యూనివర్సిటీ అంటారు కాబట్టి తెలుగులోనూ విశ్వం అన్నారు అనుకుందామా? అది నిజమే కావచ్చు! కాని, విశ్వం అనే పదంలో విశ్వవిద్యాలయానికి మరో కోణమూ వుంది!

 

ఇప్పుడొస్తున్న ఆధునిక విశ్వవిద్యాలయాల సంగతి వేరేమోగాని … ఒకప్పటి విశ్వవిద్యాలయాలు మాత్రం నిజంగానే విశ్వాలు! వాటిలో మరో వేరైన, మేలైన ప్రపంచమే అలరారుతుంటుంది! విశ్వవిద్యాలయం అంటే కేవలం కొన్ని గోడలు, మరి కొన్ని బెంచీలు, ఇంకొన్ని బ్లాక్ బోర్డులు కాదు. అదో లోకం. అక్కడ వేరు వేరు ఊళ్ల నుంచీ, రాష్ట్రాల నుంచీ, కొన్ని సార్లు దేశాల నుంచీ వచ్చిన వారు ఒకే చోట గుమిగూడతారు! తరగతుల్లో, మైదానాల్లో, చెట్ల కిందా, క్యాంటీన్లలో, లైబ్రెరీల్లో సరికొత్త బంధాలు, అనుబంధాలు, ఘర్షణలు,సంఘర్షణలు ఏర్పడతాయి! అదే వారందర్నీ నవ మానవులుగా తీర్చిదిద్దుతుంది! చివరకు, విశ్వవిద్యాలయంలో జరిగిన ఆ మానవ, మస్తిష్కాల సమ్మేళనమే కొత్త విశ్వానికి పునాదులు వేస్తుంది! అందుకే, యూనిర్సిటీల్ని విశ్వవిద్యాలయాలు అనేది…

 

ఒక విశ్వవిద్యాలయం యావత్ విశ్వంపై తనదైన, తనకు వీలైనంత ప్రభావం చూపుతుంది! ఈ సత్యం వేల సంవత్సరాల నాటి తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ఎప్పుడో నిరూపించాయి. తక్షశిలలో పదునెక్కిన చాణక్యుడి రాజనీతి, ఆర్దిక నీతి భారతదేశాన్ని ఎంత ప్రభావితం చేశాయో మనకు తెలియదా? అలాగే, నలందలో జరిగిన వందల సంవత్సరాల జ్ఞాన సత్రయాగం మన దేశాన్ని, సంస్కృతిని ఎంత సుసంపన్నం చేసిందో మర్చిపోగలమా? అలాంటి మన కాలపు, మనదైన… తక్షశిల, నలంద స్థాయి విశ్వవిద్యాలయమే … ఉస్మానియా!

 

హైద్రాబాద్ అనగానే నిశ్శబ్ధంగా నిలబడే చార్మినార్ నే అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. లేదంటే ఆధునిక హైద్రాబాదీలు ఆదరా బాదరా ఉద్యోగాల సైబర్ టవర్స్ ని స్మరించుకుంటారు. కాని, 4వందలేళ్ల భాగ్యనగరి భాగ్యానికి… సదా సజీవ చైతన్యంతో అలరారే వందేళ్ల ఉస్మానియా అసలు సిసలు సాక్ష్యం! అక్కడ 1917 నుంచీ జ్ఞానం శంఖమై మోగుతోంది! ఉద్యమాలు వస్తే, చైతన్యం, నగారాలాగా మార్మోగుతోంది! నిజాం కాలంలో 25మంది ఆధ్యాపకులతో, 225మంది విద్యార్థులతో తన మహాప్రస్థానం ప్రారంభించి ఇంకా మహోధృతంగా ముందుకు సాగుతోంది. ఈ విజయానికి కారణం ఆనాటి నిజాం పాలకుల ముందు చూపే కాదు… తరువాతి కాలంలో స్వతంత్ర భారత ప్రభుత్వాల నిజాయితీ కూడా కాదు. ఉస్మానియా ఒక ఆరని జ్యోతిలా, దారి చూపే అద్బుత కాగడాలా వెలిగిపోవటానికి కారణం… ఇక్కడ తొణికిసలాడే జీవం కారణం! కేవలం మసక్తాల్లోకి పుస్తకాల్ని ఎక్కించే ల్యాబోరేటరీలా ఉస్మానియా పని చేసి వుంటే ఇంత ఘనత సంపాదించగలిగేది కాదు. నిజానికి ఇప్పటికీ హైద్రాబాద్ కు తలమానికమైన ఓయూ దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒక్కటేం కాదు. ప్రపంచంలో అయితే ఉస్మానియాకు అస్సలెంత మాత్రం ప్రాముఖ్యత లేదు. అయినా, తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా, తెలంగాణకు ఇది ఒకానొక ఆయువు పట్టు! ఒట్టి బట్టీ చదువులకే కాదు… ఉరిమే ఉద్యమాలకూ ఉస్మానియానే నెలవు! ఆ విధంగా ఉస్మానియా ఇప్పటికి కొన్ని వేలు, లక్షల మంది తెలంగాణ విద్యార్థులకి చదవటమే కాదు.. జీవితాన్ని , సమాజాన్ని చదవటమూ నేర్పింది! అదీ శత వసంతాల ఉస్మానియాకు అనుపమాన శోభను తెచ్చిపెట్టేది!

 

బీఏ, ఎంఏ లాంటి డిగ్రీలతో మొదలైంది ఉస్మానియా ప్రస్థానం. అప్పటి నిజాముల రాజభాష ఉర్దూలోనే ఊపిరిపోసుకుంది. కానీ, ఇప్పుడు ఎల్ఎల్బీ, మెడిసిన్, ఇంజనీరింగ్, పీహెచ్డీలతో ఎంతో ఎదిగింది. ఇంగ్లీషు సహా ఎన్నో భాషల్లో బోధన జరుగుతోంది. దానితో పాటే స్వాతంత్రానికి ముందు ఇక్కడ వందేమాతర నినాదం మోగింది.అది మొదలు 2014లో పార్లెమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దద్ధిరిల్లిన జై తెలంగాణ నినాదాల వరకూ ఉస్మానియా అడుగడుగునా ఉద్యమాలే! పోరాటాలే! రణన్నినాదాలే! సమాజంపై ప్రభావం చూపే ఈ పోరాట పటిమే నిజంగా వందేళ్ల ఉస్మానియా అందించిన వారసత్వం! కేవలం సర్టిఫికెట్ ముక్కలు జారీ చేయటానికి విశ్వవిద్యాలయాలే అక్కర్లేదు. రేకుల షెడ్డు వేసుకుని కూర్చున్నా సరిపోతుంది! విశ్వవిద్యాలయం అంటే విశ్వాన్ని మరింత పరిపక్వం చేసే మేధస్సుల ప్రయోగశాల అయ్యి వుండాలి! ఆ కోణంలో వందేళ్ల ఉస్మానియాది వంద శాతం విజయం!

 

ప్రస్తుత మన బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి, నవ తెలంగాణ రథసారథి కేసీఆర్ ఉస్మానియాలో గుక్క తిప్పిన యోధుడే! గల్లీ నుంచీ దిల్లీ దాకా ఈ ఓయూ పూర్వవిద్యార్థి చేసిన ఉద్యమం జగమెరిగిన సత్యమే! అయితే, ఉస్మానియా చరిత్రలో ఒక్క కేసీఆర్ కాదు…ఎందరో కేసీఆర్లు వున్నారు! తమ తమ రంగాల్లో వారు ఇప్పటి మన సీఎం లాగే అద్బుత విజయాలు సాధించారు. వారందరి పేర్లు చెబితే ఉస్మానియా జ్ఞానాకాశం కీర్తిమంతులైన తారలతో తళతళలాడిపోతుంది. ఇక ముందు కూడా ఈ శత వసంతాల నవ యవ్వన జ్ఞానాలయం బోలెడు మంది విద్యార్థి చంద్రులతో వెలిగిపోవాలని కోరుకుందాం! వారు దేశాన్ని సరికొత్త వెన్నల వెలుగులతో దేదీప్యమానం చేయాలని ఆశిద్దాం!

 

ఉస్మానియా వందేళ్ల మైలురాయి దాటిన ఈ సమయంలో చాలా మంది కోరుకుంటోంది, రాష్ట్రపతి ప్రణబ్ కూడా చెప్పింది ఇదే… విశ్వవిద్యాలయాలు పరిశోధన వైపు దృష్టి పెట్టాలి. ఉస్మానియా పై కూడా ఆ బాద్యత వుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే ఉత్సాహంతో ముందుకు దూకుతోంది. అందుకు కేవలం జీడీపీలు, పర్ క్యాపిటీ ఇన్ కమ్ లు సరిపోవు. నాణ్యమైన జ్ఞానం విశ్వవిద్యాలయాల్లోంచి బయటకొ ప్రవహించాలి. ఉస్మానియాలోనూ అదే జరగాలి. ముందు ముందు పాలకులు, పరిశ్రమల అధిపతులు పరిశోధన విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగే చర్యలు తీసుకోవాలి! దేశంలోనే అత్యున్నత ప్రాంగణాల్లో మన ఉస్మానియా కూడా ఒకటి కావాలి!