అయ్యో పాపం.. ఏపీ సర్కార్ తీరుతో అధికారులు బలి!!

 

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వైఖరితో అధికారులు బలవ్వబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. రేమండ్ పీటర్ అనే ఓ మాజీ అధికారి నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని సీఎం జగన్ నియమించారు. ఈ కమిటీ పోలవరంపై పరిశీలన జరిపి అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. వెంటనే ఈ నివేదిక ఆధారంగా నవయుగ టెండర్లు రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి రేమండ్ పీటర్ కమిటీ నివేదికను సమర్పించారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం గతంలో ఇచ్చిన నివేదికలకు అది పూర్తి భిన్నంగా ఉండటంతో.. ప్రధానమంత్రి కార్యాలయం వివరణ అడిగింది. పీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతో నివేదికలో ఉన్న అంశాలపై పోలవరంం ప్రాజెక్ట్ అధారిటీని కేంద్ర జలశక్తి కార్యదర్శి వివరణ కోరారు. సీఎం జగన్ సమర్పించిన నివేదికపై పూర్తిస్థాయిలో వివరణ పంపించాలని ఏపీ జలవనరుల శాఖను పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఆదేశించింది. రేమండ్ పీటర్ నివేదికలో చెప్పిన ప్రతీ ఆంశానికి ఆధారం ఏమిటో చెప్పాలని అడిగితే జగన్ సర్కార్ సైలెంటయింది. మూడో తేదీలోపు సమాధానం పంపాల్సి ఉన్నా పంపలేదు. దీంతో ఏపీ సర్కార్ పై కేంద్రం సీరియస్ అయింది. రివర్స్ టెండర్లపై పీఎంఓ అడిగిన ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజులలో స్పందించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

నిపుణుల కమిటీ నివేదికపై వివరణ ఇవ్వాలని పదే పదే కేంద్రం నుంచి పీఎంవో నుంచి లేఖలు వస్తున్నా ఏపీ సర్కార్ స్పందించట్లేదు. అయితే ఇప్పుడు ఈ అంశం అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏంటని.. కేంద్రం అడిగితే నీళ్లు నమలడం.. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల వంతు అయింది. ఎందుకంటే.. గత ప్రభుత్వం హయాంలో.. పోలవరంలో ఎలాంటి అవకతవకలు లేవని, అంతా పర్‌ఫెక్ట్‌గా జరుగుతోందని నివేదికలు ఇచ్చింది అధికారులే. ఇప్పుడు అక్రమాలు ఉన్నాయని చెబుతున్నది ఆ అధికారులే. ఇప్పుడా కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలు లేకపోతే కేంద్రం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులకే చిక్కులు రానున్నాయి. ఎందుకంటే.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సినట్లుగా నివేదిక ఇచ్చిన రేమండ్ పీటర్‌కు.. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అధికారిక కమిటీ కాదు. కానీ ఆ నివేదికను అడ్డం పెట్టుకుని.. కాంట్రాక్టులు రద్దు చేయడం, కారణాలు లేకుండా అవినీతి అని వాదించడంతోనే అసలు సమస్య వస్తోంది. దీనికి అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి ఈ అంశం అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది.