మధ్యమధ్యలో కాలుకదపితే... ఆయుష్షు పెరుగుతుంది!

Sedentary lifestyle.  అబ్బో ఈ మాటని ఈమధ్య చాలా ఎక్కువగానే వింటున్నాం. ఎలాంటి శారీరిక శ్రమా లేకుండా, నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలిని sedentary lifestyle అంటారని మనకి తెలుసు. నిరంతరం కూర్చుని కూర్చుని ఉంటే, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట మీద ఒత్తిడి పెరిగి జీర్ణవ్యవస్థ పాడైపోవడం, మెదడుకి చేరే రక్తప్రసారంలో లోపం ఏర్పడటం, వెన్నెముక బలహీనపడిపోవడం, ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు పెళుసుబారిపోవడం వంటి నానాసమస్యలూ దరిచేరతాయి. ఇవి డయాబెటిస్‌, పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్రమైన ప్రమాదాలకి దారితీస్తాయి.

 

కూర్చుని ఉండటం వెనుక ఎన్నో ప్రమాదాలు దాగిఉన్నాయని తేలిపోయింది. పోనీ రోజూ కాసేపు వ్యాయామం చేద్దామా అంటే... అది అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి అసలు కూర్చోవడంలోనే ఏమన్నా మార్పు తీసుకురావచ్చునేమో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దాదాపు ఎనిమిదివేల మందికి ఓ యంత్రాన్ని అమర్చారు. ఆ యంత్రం ద్వారా వారి శరీరకదలికల మీద నిఘా ఉంచారు.

 

ఎనిమిదివేల మంది అభ్యర్థులలో దాదాపు 77 శాతం మంది నిరంతరం కూర్చునే ఉంటున్నారని తేలింది. వీరి రోజులో సగభాగం కూర్చునే సాగిపోతోందట. మరో నాలుగేళ్లు గడిచిన తర్వాత వీరిలో ఓ 340 మంది చనిపోయారు. అయితే దఫాకు ఓ గంట నుంచి గంటన్నర పాటు కదలకుండా కూర్చునేవారే తొందరగా చనిపోతున్నట్లు తేలింది. అరగంటకి ఓసారి లేచి అటూఇటూ తిరిగేవారి ఆయుష్షు ఎక్కువగానే ఉన్నట్లు గమనించారు. అంటే రోజంతా కూర్చునే ఉన్నాకూడా, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుందన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా! మరింకేం ఆచరించేస్తే సరి.

- నిర్జర.