ఎన్టీఆర్ కు తీరని అవమానం !

 

 

ఎన్టీఆర్, ఈ పదం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయనను తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. తెలుగు ప్రజలకు ఆయన ఆరాధ్య దైవం. తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియ చెప్పిన గొప్ప వ్యక్తిగా ఆయనను తెలుగు ప్రజలు చిర కాలం గుర్తు పెట్టుకుంటారనడంలో రాష్ట్రంలో, బహుశా దేశంలో కూడా, ఎవరికీ ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు.

 

అలాగే, తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అన్ని పౌరాణిక పాత్రల్లో నటించి రాముడంటే ఎన్టీఆరే, కృష్ణుడంటే ఎన్టీఆరే అని గుర్తువచ్చేలా తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయారు. అంతే కాదు, ఆయనను తెలుగు ప్రజలు మూడు సార్లు ముఖ్య మంత్రిగా ఎన్నుకొన్నారు. తెలుగు గడ్డ మీద ప్రతి పేదవాడికి ఉపయోగపడే అనేక పధకాలను ప్రవేశపెట్టి వారికి దేవుడిగా గుర్తించబడ్డ వ్యక్తి,

 

అవినీతి మచ్చలేని నాయకుడు. ఇలా సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి, తెలుగేతర ప్రాంతాల్లో తెలుగు వాడివేడిని చాటి చెప్పిన వ్యక్తి ఆయన. అన్నగారుగా తెలుగు ప్రజలచే కీర్తించబడే అరుదైన వ్యక్తి ఎన్టీఆర్.

 

రాజకీయాలకు అతీతమైన గొప్ప వ్యక్తి ఆయన. ఆ నట సార్వభౌముడికి మాత్రం ప్రపంచ మహా సభల్లో తీరని అవమానం జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన తెలుగు జాతికి పెద్దగా చేసిన సేవలేమీ లేవనే విధంగా వ్యవహరించింది. నిన్న తిరుపతిలో అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయిన నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించకుండానే తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి.

 

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో అన్నమయ్య, పి.వి.నరసింహా రావు, నీలం సంజీవ రెడ్డి, వెంగమాంబ, పింగళి వెంకయ్య, శంకరంబాడి సుందరాచార్య, జి.ఎం.సి.బాలయోగిల పేర్లను ప్రస్తావించారు. అయితే, తాను నిర్వహిస్తున్న పదవిలో మూడు సార్లు కూర్చున్న ఎన్టీఆర్ మాత్రం ఆయనకు గుర్తుకు రాలేదు !

 

ఆలాంటి గొప్ప తెలుగు వ్యక్తిని, అదీ తెలుగు మహా సభల్లో స్మరించుకోవడంలో కూడా కుళ్ళు రాజకీయాలు చోటు చేసుకోవడంఫై ఎన్టీఆర్ అభిమానులతో పాటు, తెలుగు భాషాభిమానులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చివరకు, సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల ఫోటో ఎక్జిబిషన్ లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోను కనిపించీ కనిపించకుండా ఏర్పాటు చేసి, ఆయన ముఖం కనిపించకుండా చేశారు.