లక్ష్మీస్ ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ రంగంలోనూ.. రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్ గురించే. మూడున్నర దశాబ్ధాల సినీ ప్రయాణం, తెలుగుదేశం పార్టీని స్థాపించి.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారాన్ని అందుకుని రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితగాథను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించగానే తెలుగునేల పులకించిపోయింది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి బయోపిక్‌లో తానే నటిస్తానని చెప్పారు. ఈ లోగా విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాను కూడా అన్నగారి బయోపిక్ తీస్తానని చెప్పడంతో అసలు వివాదం రేగింది. వర్మ అంటనే వివాదాలకు కేరాఫ్ అలాంటి వర్మ.. అన్నగారి జీవితాన్ని ఎంత వివాదాస్పదంగా తెరకెక్కిస్తాడోనన్న సందేహాన్ని సగటు తెలుగువాడు వ్యక్తం చేశాడు.

 

దానికి తోడు ఈ సినిమాను నిర్మిస్తోన్న వ్యక్తి వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. దీంతో టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తాడని విమర్శకుల అంచనా. వైశ్రాయ్ ఇన్సిడెంట్, తెలుగుదేశంలో చంద్రబాబు పాత్ర, చివరి రోజుల్లో అల్లుడిపై అన్నగారి అక్రోశం తదితర అంశాలను ఖచ్చితంగా టచ్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.

 

వర్మ తీయబోతున్న సినిమా గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదని.. దీనిపై అతిగా స్పందించవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను తెలుగుజాతి ఎన్నటికీ మరువదని అన్నారు. వర్మ- వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కలిసి తీస్తోన్న సినిమాను ప్రజలంతా గమనిస్తున్నారని సీఎం తెలిపారు. ఇలాంటి సినిమా గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అనుకొన్న నేతలకు ఆయన తన మార్క్ మాటలతో.. చాలా కూల్‌గా సమాధానం చెప్పి.. ఏదేదో అవుతుందనుకొన్న వారికి బాబు మాటలు ఏమాత్రం రుచించవు.