మృతి లేని స్మృతి!

 

ఈ భౌతికమైన సృష్టిలో ఏకైక హీరో... మృత్యువు!మరణం అందర్నీ జయించేస్తుంది!దాని ముందు ఓడిపోని హీరోలు ఎవ్వరూ వుండరు.జీవితాంతం తమ తమ రంగాల్లో ఎన్నెన్నో విజయాలు సాధించినా చివరకు చావుతో మాత్రం ఓటమి అంగీకరించాల్సిందే.ఆ దిగ్భ్రాంతికర సత్యాన్ని విధి మరోసారి నిరూపించిన విషాదకర దినమే... ఈ రోజు!సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున తెల్లవారుతుండగానే తెలుగు నేల నిలువునా కంపించింది.ఎవ్వరూ ఊహించని విధంగా తమ అభిమాన నటుడు,నేత ఎన్టీఆర్ మరణించారని జనం చెవుల్లో పడింది.ఆయన అభిమానులైతే శోక సముద్రంలో మునిగిపోయారు...


తన జీవితంలో ఓటమిని ఏనాడూ అంగీకరించని నివురుగప్పిన నిప్పు అన్న ఎన్టీఆర్.ఆయన తన విజయాలు ఆరిపోయిన ప్రతీసారి భగ్గున మండుతూ పైకి లేచారు.ఆయన పట్టుదల,దీక్ష కలిగిన విశిష్ట వ్యక్తిత్వమే ఆయన విజయాల్ని పదే పదే రాజేసిన గాలి.కాని,ఎందుకో ఏమో రాజకీయాల్లో మాత్రం ఆ పంథా కొనసాగలేదు.పదే పదే పదవీ గండం పైపైకి వచ్చింది.ఆయన సహజ శైలిలో సవాళ్లని వెక్కిరించి,ధిక్కరించి నిలిచారు.కాని,అంతిమంగా మాత్రం వెండితెరపై వెలిగిపోయిన స్థాయిలో రాజకీయ రొచ్చులో స్థిరంగా నిలబడలేకపోయారు.బహుశా మేకప్ వేసుకుని సమ్మోహనకరంగా నటించటం తెలిసిన ఆయనకు మేకప్ లేకుండా నిజ జీవితంలో నటించటం తెలియకపోవటమే కారణమనుకుంటా...


నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి.తెలుగు జాతి చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన మహానేత.ఏ ఢిల్లీ వీధుల్లో తెలుగు ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిందో... అదే ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా తన ప్రాంతీయ పార్టీని నిలిపిన ఘునుడు.కాని,ఇవన్నీ నటరత్నగా ఆయన సంపాదించుకున్న అభిమానం ముందు దిగదుడుపే.రాజకీయ నేతగా కన్నా ఎన్టీఆర్ నటుడిగానే తెలుగు వారికి మహా ప్రీతి.పార్టీల పరంగా ఆయనను వ్యతిరేకించే రాజకీయ జనాలు వుంటారేమోగాని నటుడిగా ఆయనని కాదనే వెర్రితనం ఏ తెలుగు వాడూ చేయడు.రాముడైనా,కృష్ణుడైనా, తెనాలి రామకృష్ణుడైనా, శ్రీకృష్ణదేవరాయలైనా... అన్నీ మనకు అన్నగారే!అదే ఆయనను అసలు సిసలు అవతార పురుషుడ్ని చేసే విశేషం!


మరణం అంటే భౌతికంగా అదృశ్యం అవ్వటమే అయితే ఎన్టీఆర్ 1996,జనవరి 18 నుంచి మన మధ్య లేనట్లే.కాని,ఆయన గురించి మాట్లాడకుండా ఇంతవరకూ ఎవరైనా తెలుగు సినిమా గురించి చర్చించగలిగారా?ఆయనని స్మరించకుండా ఎవరైనా తెలుగు జాతి రాజకీయాలు వర్ణించగలరా?అస్సలు సాధ్యం కాదు!ఇప్పుడే కాదు,ఇక ముందు కూడా వీలు కాదు.తెలుగు పదంలో ఎన్టీఆర్ అన్న శబ్దం అంతర్లీనంగా ధ్వనిస్తూనే వుంటుంది.అందుకే, మన నందమూరి తారకరాముడికి వర్ధంతి వుంటుందేమోగాని... మరణం మాత్రం వుండదు!