పెద్దనోట్ల రాద్ధాంతం ఇంకెన్నాళ్లు

మోదీ పెద్దనోట్లని రద్దు చేసి ఇప్పటికి రెండు నెలలు దాటిపోయింది. కొత్త ఐదువందల నోట్ల సరఫరా విస్తృతం కావడంతో బ్యాంకుల పరిస్థితి కాస్త మెరుగయినట్లే కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఉపయోగమా కాదా అన్న మీమాంశ మీద ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నల్లధనం రద్దు కోసమూ, నగదురహిత సమాజం కోసమూ ఈ చర్య తప్పలేదు అని ప్రభుత్వం వాదిస్తుండగా... ఈ నిరంకుశ నిర్ణయంతో బాధపడింది పేదవాడు మాత్రమే అన్నది విమర్శకుల మాట.

 


నిజం ఏదైతేనేం నిర్ణయం మాత్రం జరిగిపోయింది. కష్టమో, నష్టమో...  ఆ నిర్ణయాన్ని భరించాం. భవిష్యత్తు బాగుంటుందనో, ప్రభుత్వాన్ని ఎదిరించలేకనో... కారణం ఏదైతేనేం మనసు రాయి చేసుకుని నోట్ల కోసం క్యూలలో నిలబడ్డాం. 90 శాతం ప్రజలు నగదు లావాదేవీల మీద ఆధారపడే సమాజంలో 86 శాతం నగదుని రద్దు చేయడం అంటే ఏమంత తేలిక కాదు. మరో దేశం అయితే తప్పకుండా కుప్పకూలిపోయేది. దేశమే అస్తవ్యస్తమైపోయేది. అలాంటిది పంటిబిగువున ఈ నిర్ణయాన్ని సహించడం బహుశా మన దేశప్రజలకే సాధ్యమేమో!

 


అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో మళ్లీ వెలువడుతున్న కథనాలు దేశాన్ని ఉలికిపాటుకి గురిచేశాయి. అమెరికా సూచనల మేరకే మోదీ పెద్దనోట్ల రద్దు చేశారంటూ ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌.కాం విడుదల చేసిన ఈ నివేదికలో కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణలు బయటపడ్డాయి. ఒబామా, మోదీ, రఘురామ్‌ రాజన్, అరుణ్‌జైట్లీలు కలిసి ఆడిన నాటకానికి పతాక సన్నివేశమే నోట్ల రద్దని ఆ పత్రిక చెబుతోంది. డిజిటల్ చెల్లింపుల పేరుతో మన దేశ ఆర్థికరంగం మీద నిరంతరం దృష్టి నిలిపేందుకు, ప్రపంచంలోని నగదు వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు అమెరికా ఈ పన్నాగం పన్నిందని ఆ పత్రిక ఆరోపిస్తోంది. సహజంగానే ఈ వేడి వేడి వార్తను మన పత్రికలు అందిపుచ్చుకున్నాయి. నల్లధనం, అవినీతి మీద యుద్ధం వంటి మారుపేర్లతో మోదీ ప్రజలను మోసపుచ్చారని దుమ్మెత్తిపోశాయి.

 


పెద్దనోట్ల నిర్ణయం వెనుక అమెరికా ప్రమేయం గురించిన వార్తలు ఊపందుకుంటుండగానే, అఖిలభారత ఉత్పత్తిదారుల సంఘం (AIMO) ప్రకటించిన నివేదిక ప్రజలను మరింత అయోమయానికి గురిచేసింది. చిన్న పరిశ్రమలలో ఇప్పటికే 35 శాతం ఉద్యోగాలు పోయాయనీ, మరో రెండు నెలల్లో ఏకంగా 60 శాతం ఉద్యోగాలు పోతాయనీ ఈ నివేదిక పేర్కొంది. ఇక అన్ని రకాల పరిశ్రమలూ దాదాపు 50 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న అంకెలతో మరోసారి పెద్దెత్తున దుమారం చెలరేగుతోంది.

 


పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థికస్థితి ఒక్క కుదుపుకి లోనైన మాట వాస్తవమే! రియల్ ఎస్టేట్‌, సినిమా వంటి రంగాలు ఏళ్ల తరబడి కోలుకోలేవన్న విశ్లేషణా వాస్తవమే! అయితే ప్రజల వద్దకి మళ్లీ నగదు చేరుకుంటుంటే రోజువారీ పరిస్థితులు చక్కబడక మానవు. కానీ ఏకంగా దేశమే శాశ్వతంగా నాశనమై పోయిందనే అంచనా అంత సహేతుకంగా తోచదు. కొనుగోలు శక్తి తిరిగి పుంజుకోగానే ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడక మానదు. దాంతో లక్షలాది పరిశ్రమలు మూతపడనున్నాయన్న అంచనా నిరాశావాదంగానే గోచరిస్తోంది.

 


పత్రికలు, వివిధ సంస్థల విశ్లేషణలు ఈ తీరున ఉంటే... ప్రభుత్వం తీరు మరో రకంగా ఉంది. ఈ రెండు నెలల కాలంలో బ్యాంకులకు చేరుకున్న డబ్బు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేసే సాహసం చేయలేకపోతోంది. నగదురహితం వెనుక అమెరికా హస్తం మీద కూడా కేంద్రం నుంచి ఘాటైన స్పందన వినిపించలేదు. రోజూ తమ భుజాలు తాము చరుచుకోవడం, మోదీని అవతార పురుషునిగా వర్ణించడం మినహా కేంద్ర మంత్రుల నుంచి ముక్కలేవీ వినిపించడం లేదు. ఆఖరికి మోదీగారు కూడా ఈ అంశం మీద స్పష్టతని ఇస్తారనుకుంటే... ఆయన కూడా యూటర్న్ తీసుకుని జాతిని ఉద్దేశించి సంక్షేమపథకాలంటూ వేరే చరణాన్ని అందుకున్నారు. ఈ సమయంలో నిర్మాణాత్మక పాత్రని పోషించాల్సిన ప్రతిపక్షం ఏం చేస్తోందయ్యా అనే మాటని మాత్రం అడగకండి. రాహుల్‌గాంధీ మీద ఒట్టు.