పాలిటిక్స్ లో లేటెస్ట్ ట్రెండ్- ‘సీట్లు, నోట్లు, ఓట్లు’

 

రామాయణం మొత్తాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పుకొంటునట్లే, ఇప్పుడు ఎన్నికల తంతుని కూడా సామాన్యులకి సైతం అర్ధం అయ్యే బాషలో ఎంచక్కగా సీట్లు, నోట్లు, ఓట్లు అని మూడు ముక్కల్లో వివరించి చెపుతున్న మన రాజకీయనాయకుల విజ్ఞతకు ప్రజలు అబ్బురపడుతున్నారు.

 

మొన్నామద్య తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘ఎన్నికలలోఖర్చుపెట్టలేనివారు పార్టీ టికెట్స్ కోసం అనవసరంగా హైరానా పడొద్దు’ అని కుండ బద్దలు కొడితే, మీడియా “కేసీఆర్ డబ్బున్న వాళ్ళకే టికెట్స్ ఇస్తాడట!” అని ఏదో ప్రళయం ముంచుకు వచ్చేస్తోందన్నట్లు మీడియా గగ్గోలు పెట్టేసింది. దానిమీద చర్చలు, విశ్లేషణలతో మరో హాట్ టాపిక్ దొరికే వరకు వారం రోజులు లాగించేసింది కూడా. అది చూసి పామరజనం ‘రాజకీయాలు నానాటికి దిగజారిపోతున్నాయంటూ’ ఓ పెద్ద నిట్టూర్పు విడిచి, మీడియా చెపుతున్నతరువాత అంశానికి వారుకూడా కూల్ గా షిఫ్ట్ అయిపోయారు.

 

నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా అనే ఓల్డ్ ఫార్ములా ఫాలో అయిపోతేనే బెటర్ అనుకొన్న చంద్రబాబు కూడా కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని, పార్టీ టికెట్ ఆశించే అభ్యర్దులు వెనక ఎన్ని ‘రాళ్ళు’ పోగేసుకొన్నారో చూసిన తరువాతనే వారి పేర్లు తన లాప్ టాప్ లో టికెట్స్ ఆశించేవారి లిస్టుకి యాడ్ చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే, ఆయనను అపార్ధం చేసుకొని పార్టీ విడిచిపెట్టినపోయిన దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి వారు, “చంద్రబాబు కేవలం డబ్బున్న పారిశ్రామిక వేత్తలను, వ్యాపారవేత్తలను ఇవాళ్ళ రేపు బాగా లైక్ చేస్తున్నాడు. వారికే టికెట్స్ ఇస్తున్నాడు తప్ప మావంటి ‘మిడిల్ క్లాస్’ రాజకీయనాయకులను బొత్తిగా పట్టించుకోవడం లేదంటూ అవాకులు చవాకులు మాట్లాడారు. పార్టీ నుండి బయటకి జంప్ చేసిన వారు ఏదయినా వాగొచ్చు గనుక, వారి విమర్శలను కొంచెం లైట్ తీసుకోక తప్పదు. కానీ, పార్టీలో ఉన్న’అప్పర్ మిడిల్ క్లాస్ పోలిటిషియాన్’ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు సైతం మహానాడు సాక్షిగా అటువంటి డైలాగులే పలికి, ఒక పద్దతిలో ముందుకు సాగిపోతున్న చంద్రబాబు సున్నితమయిన మనసుని నొప్పించారు. బుచ్చయ్యగారు చెప్పిన దానిప్రకారం తెదేపా కూడా ఆ తానులో ముక్కేనని స్పష్టం అవుతోంది.

 

ఈ ‘సీట్లు, నోట్లు, ఓట్లు’ ఫార్ములాను సరిగ్గా అర్ధం చేసుకోలేని పామర జనం ‘మరి తమ పార్టీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు పదేపదే ఎందుకు చెపుతున్నట్లు?’ అని ఒక వెర్రి ప్రశ్న వేయవచ్చును. ‘పార్టీలో కార్యకర్తలందరూ పార్టీ జెండాలు మోసి, పార్టీని (టికెట్స్ పుచ్చుకొన్నవారిని) గెలిపించడానికే ఉన్నారని, అది వారి బాధ్యత’ అని చంద్రబాబు మొదటి నుండి స్పష్టంగానే చెపుతున్నారు. ఆయన అంత స్పష్టంగా చెపుతున్నా కోడా అర్ధం చేసుకోక ఇటువంటి వెర్రి ప్రశ్నలు వేస్తున్న ప్రజలను, కార్యకర్తలను ఏమనాలి?

 

ఇక, ఎన్నికలలో నోటుకి, సీటుకి, ఓటుకి మద్య ఉన్న ఈ కనబడని లింకును తప్పించడం ఎవరి వల్లా కాదని మొన్న మొన్ననే మెగా సోదరుడు నాగబాబు కూడా అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు పూర్తిగా కరెప్ట్ అయిపోయున్నారు గనుక నోటు, సీటు, ఓటు ఫార్ములా ఇప్పుడు అన్ని పార్టీలు అమలు చేయక తప్పదని ఆయన తన బాధాకరమయిన ఏడాది రాజకీయ అనుభవ సారాంశాన్ని అంతా రంగరించి మనకి తెలియజేసి చాలా పుణ్యం కట్టుకొన్నారు. దీనినే ప్రాక్టికల్ ఎప్రోచ్ అంటారేమో కదా!

 

అందువల్ల ఈ ఫార్ములాను ఎంతో నిబద్దతతో, విజయవంతంగా అమలుచేస్తున్న మన రాజకీయ పార్టీలను అనవసరంగా ఆడిపోసుకోవడం మాని మనమూ మన వాటాలు క్లెయిమ్ చేసుకొంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాము.