వీళ్లు ‘తమిళులు’కారంటే తమిళియన్సే ఒప్పుకోరు! కానీ…

కరుణానిధి మరణంతో తమిళనాడులో మరో శకం ముగిసింది! కానీ, ఈ మధ్య కాలంలో ఇది రెండో షాక్! జయలలిత అనూహ్య మరణం తమిళులపై ఎలాంటి ప్రభావం చూపిందో మనం చూస్తూనే వున్నాం! ఇంకా చెన్నై రాజకీయాలు ఎంత మాత్రం సద్దుకోలేదు. సద్దుమణగలేదు. పళని, పన్నీర్, శశికళ, దినకరన్, రజినీ, కమల్… ఇలా అనేక దిక్కుల్లో రాజకీయం రంగులు మారుతోంది! ఇంతలోనే తమిళ కురుక్షేత్ర కురువృద్ధుడు కరుణానిధి కూడా మరణించారు! ఇప్పుడిక ఒక తరం దాదాపుగా ముగిసిపోయినట్టే! జయ, కరుణా నిష్క్రమణంతో కొత్త నాయకత్వం రావాల్సిందే! మరి భవిష్యత్ తమిళనాడుని ఎవరు శాసిస్తారు? స్టాలిన్, రజినీకాంత్ లకి అందరికంటే ఎక్కువ అవకాశాలున్నాయి. కమల్, దినకరన్ లాంటి వారికి మొత్తం రాష్ట్రాన్ని ఏలటం కష్టమే! అయితే ఇక్కడే ఒక చారిత్రక విచిత్రం దాగుంది! రజినీకాంత్ ఒకవేళ తమిళనాడు తరువాతి ముఖ్యమంత్రి అయితే మరోసారి తమిళ నేల పరాయి భాషా వ్యక్తికి అధికారం కట్టబెట్టినట్టు అవుతుంది!

 

 

దేశంలోనే భాష పేరుతో అత్యంత ఆత్మాభిమానం కలిగి వుండటం తమిళులకే చెల్లింది. హిందీకి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చాలా పెద్దది. ఇప్పటికీ తమిళ అభిమానం అక్కడి ప్రజలకి చాలా మెండు. అయితే, అంతగా భాషాభిమానం, ప్రాంతీయత వున్నా వారు ఎప్పుడూ ఇతర భాషల్లో మూలాలున్న వారికే ప్రభావితం అవుతూ వస్తున్నారు! ఇది చాలా మంది తమిళులకి కూడా తెలియని విషయం!

కరుణానిధిని తమిళులు అయిదు సార్లు తమ ముఖ్యమంత్రిని చేశారు! కానీ, ఆయనెవరో తెలుసా? తమిళనాడులో పుట్టిన తెలుగు బిడ్డ! ఆయన తల్లిదండ్రులు ఆంధ్రా ప్రాంతం వారే! ఇక్కడ్నుంచీ వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వారికి పుట్టిన వారే కరుణానిధి! కరుణ చక్కగా తెలుగులో మాట్లాడేవారు కూడా!

 

 

కరుణానిధి తెలుగు వారైతే ఆయనను బద్ధ శత్రువుగా చూసిన జయలలిత? ఆమె కూడా తమిళ స్త్రీ కాదు! ఆమెది కర్ణాటక! మైసూర్ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులకి పుట్టిన కన్నడ అమ్మాయే జయ! పుట్టుకతో కోమలవల్లి అనే పేరున్నా జయా విలాస్, లలితా విలాస్ అనే పేర్లున్న రాజగృహాల మీదుగా ఆమెకు జయలలిత పేరు వచ్చింది! ఆ రెండు రాజగృహాలు మైసూర్ రాజువి! ఆయన వద్ద జయలలిత తాతగారు వైద్యుడిగా పని చేసేవారు!

ఇతర భాషల నుంచీ వచ్చి తమిళులపై తీవ్ర ప్రభావం చూపిన వ్యక్తుల లిస్టు ఇంకా చాలా వుంది! జన్మతః శివాజీ రావు గైక్వాడ్ అయిన మరాఠీ కళాకారుడే తమిళులే సూపర్ స్టార్ అయ్యాడు! రజినీకాంత్ గా చరిత్ర సృష్టించాడు! త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్న ఆయన దైవం శాసిస్తే తరువాతి ముఖ్యమంత్రి కూడా కావచ్చు! కర్ణాటకలో పుట్టి పెరిగిన మరాఠీ మన శివాజీ!

 

 

జయలలిత, కరుణానిధి లాంటి ముఖ్యమంత్రులే కాదు గతంలోనూ ఇతర భాషలతో సంబంధం వున్న ముఖ్యమంత్రులు తమిళనాడుని ఏలారు! తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ అలాంటి వారే! ఆయనను డీఎంకే నుంచి బహిష్కరించిన కరుణానిధి ఎంజీఆర్ బ్రతికి వున్నంత కాలం అధికారానికి దగ్గరవ్వలేకపోయారు! వరుసగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చిన ఎంజీఆర్ శ్రీలంకలో పుట్టిన మలయాళీ! అయినా తమిళనాడు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని తిరుగులేకుండా పరిపాలించారు!

 

 

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కొద్దోగొప్పో ప్రభావం చూపుతున్న మరో సినిమా హీరో విజయ్ కాంత్. ఆయన పార్టీ డీఎండీకే. ఈయన కూడా తెలుగు వాడే! తెలుగు తల్లిదండ్రులకి తమిళనాడులో పుట్టారు! ఆయనలాగే తమిళ పాలిటిక్స్ లో రెబెల్ గా ముద్ర పడ్డ వైగో కూడా తెలుగు వారే! ఈయన అసలు పేరు వాయుపురి గోపాలస్వామి! షార్ట్ వైగో అయ్యారు. కరుడుగట్టిన తమిళ జాతీయ వాదిగా పేరున్న ఈయనకు ఒక వర్గం ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వుంది! కానీ, వైగో మూలాలు కూడా తెలుగు నేలపైనే వున్నాయి!

ఇక తెలుగు లింక్ వున్న మరో తమిళ పొలిటికల్ హీరో నెపోలియన్. డీఎంకేలో వుండీ మంత్రి కూడా అయిన ఆయన అళగిరి వర్గంలో వుండటంతో స్టాలిన్, కరుణానిధి పక్కన పెట్టారు. 2014లో బీజేపీలో చేరారు. నెపోలియన్ ఆంధ్రా నుంచి వలస వెళ్లిన రెడ్డియార్ కుటుంబంలో జిన్మించారు! అయితే, నెపోలియన్ లా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ… పందెం కోడి విశాల్ కూడా తెలుగు వాడే!

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా… తమిళనాడులో ద్రవిడ ఉద్యమం లేవనెత్తిన ఈవీ రామస్వామి నాయికర్ ఎవరో తెలుసా? కొంత మంది పరిశోధకుల మాట ప్రకారం మన తెలుగు వాడే! అయితే, మరికొందరు మాత్రం ఆయనని కన్నడ బలిజ సామాజిక వర్గానికి చెందిన కుటుంబీకుడు అంటుంటారు!

మా భాషా, మా ప్రాంతం అంటూ అభిమానం చాటుకోవటంలో దేశంలో తమిళుల తరువాతే ఎవరైనా! కానీ, వారి మీదే ఇంత మంది తమిళులు కాని వారి ప్రభావం వుండటం… నిజంగా ఆశ్చర్యమే! కాకపోతే, ఈ లిస్టు మొత్తం చూశాక… ఒక పంజాబీ ముస్లిమ్ యువతి అయిన ఖుష్బూకీ గుడికట్టిన వారి అభిమానం ఈజీగా అర్థం చేసుకోవచ్చు! నచ్చకపోతే ఎంత ద్వేషమో… నచ్చితే అంత ప్రేమ అనేది తమిళ ఫార్ములా!