ఏపీ ఎన్నికలు.. 50 కోట్లు ఖర్చు పెట్టేవారికే ఎమ్మెల్యే టికెట్

 

ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే.. ఆ వ్యక్తికి ప్రజల్లో మంచి పేరుందా? ప్రజలకు సేవ చేస్తాడా? అని పార్టీలు ఆలోచించేవి. కానిప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ ఖర్చు చేయగలడా? లేదా? అని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఆలోచించడం ఏంటి.. అలా ఖర్చు చేయగలిగిన వారికే టిక్కెట్లు ఇస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూడా ఎమ్మెల్యే టిక్కెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగల వారికే దక్కేలా కనిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని వైసీపీ భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే టీడీపీకి ధీటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తోంది. మొన్నామధ్య వైసీపీ అధినేత జగన్.. పార్టీలో కష్టపడేవారి కంటే ఎన్నికల్లో ఖర్చుపెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 'నిప్పు లేనిదే పొగ రాదు' అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటారు. వారిని ఓడించాలంటే అంతకన్నా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అందుకే వైసీపీ నియోజకవర్గాన్ని బట్టి 25 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోందట.

అయితే ఇలా పార్టీలు పోటాపోటీగా ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులను బరిలోకి దింపాలి అనుకోవడం.. నిజంగా పార్టీ కోసం కష్టపడే, ప్రజలకు సేవ చేసే మధ్యతరగతి నాయకులకు బాధ కలిగించే విషయమనే చెప్పాలి. బడాబాబులకు టికెట్ ఇస్తే ఖర్చు చేస్తారు. గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. తరువాత అవకాశాన్ని బట్టి పార్టీ కూడా మారుతారు. కానీ పార్టీనే నమ్ముకున్న మధ్యతరగతి నాయకులు అలా కాదు. టికెట్ వచ్చినా రాకపోయినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే ఉంటారు. పార్టీకోసం కష్టపడతారు. ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని చూస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో.. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన మధ్యతరగతి నేతలు టికెట్ రాదని తెలిసి బాధపడుతున్నప్పటికీ.. పార్టీని వీడే ఆలోచనలో లేరు. మరి ఇప్పటికైనా ప్రధాన పార్టీలు ఖర్చు పెట్టేవారికి కాదు.. కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు ఇవ్వాలని మనసు మార్చుకుంటాయేమో చూడాలి.