కాపు రిజర్వేషన్లకి బ్రేకులు వేసిన జగన్...ప్లస్సా... మైనస్సా ?

 

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తున్నట్టు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 

అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు బదులుగా ఓసీ జాబితాలో ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు మాత్రం పదిశాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన ఎన్నిక మ్యానిఫెస్టో హామీని అమలు చేసేందుకు గాను  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం కోటాలో సగం కాపులకి కేటాయించింది. 

అయితే తాజాగా జగన్ సర్కార్ దానిని తొలగించింది. తాజా చట్టం ప్రకారం ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల పరిధిలోకి రాకుండా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. దీంతో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్ధలంలో ఇల్లు లేదా పట్టణ ప్రాంతాల్లో 100చదరపు గజాల స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల ఇంటి స్ధలం కలిగిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు. 

ఆయా నిబంధనల ప్రకారం విద్యాసంస్ధల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది.వాస్తవానికి గతంలో మోదీ సర్కారు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేసింది..ఆ చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 10 శాతం పెంచి అందులో ఆర్ధికంగా వెనకబడ్డ వారికి కేటాయించాల్సి ఉంటుంది. 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్రం చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యామండలి సూచనతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇప్పటికే సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లను పెంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. 

ప్రభుత్వ జీవోతో దీని అమలుకు మార్గం సుగమమైంది. కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరనుంది. ఐదుశాతం కాపు రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రాజకీయంగా మరో సారి దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కాపులు మాత్రమే ఆసక్తితో ఉన్నా మిగతా సామజిక వర్గాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబుని సొంత సామాజిక్ వర్గం వారు కూడా ఈ విషయంలో విభేదించారు, సో ఈ రిజర్వేషన్లు నిలిపివేత ఒకరకంగా జగన్ కి ప్లస్సే అని అంటున్నారు.