ధూమపానం మరణంతో సమానం

ప్రతి సిగరట్ ప్యాకేట్ మీద ఎంతో చక్కగా రాస్తారు స్మోకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్ అని,కాని అది ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి మరీ సిగరెట్ తో పాటు రోగాలని కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ధూమపానం వల్ల ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఒక అంచనా. ఈ రోజు No smoking day. ఈ సందర్భంగా కొంతమంది అయినా ఈ అలవాటుకి దూరమయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు.

 

ఈ సిగరెట్ కాల్చేవాళ్ళకి ఎంత ముప్పు ఉందో అది కాల్చకపోయిన పక్కనే ఉండి పీల్చేవాళ్ళకి దానికి రెండింతలు ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. సిగరెట్ తయారుచేయటానికి వాడే పదార్థాలలో 4000 కెమికల్స్ కలిసి ఉంటాయట.  ఒకప్పుడు ఏదైనా బాధలోంచి బైటకి రాలేనివారు ఒక మత్తు పదార్ధంగా భావించి దీనికి అలవాటు పడేవారు. కాని ఈ రోజుల్లో పొగతాగటం ఒక ఫాషన్ గా మారిపోయి ప్రాణాలని తెలియకుండానే మింగేస్తోంది.

 

 

సిగరెట్ లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం వల్ల గుండె  కొట్టుకోవలసిన వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుని గుండె దడకి, గుండెపోటుకి దారితీస్తాయి. పొగతాగేవారిలో 90% మంది  లంగ్  కాన్సర్ బారిన పడుతున్నారట. 70% మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. సిగరెట్ లో కలిపే తారు, నెయిల్ పాలిష్ రిమూవర్, క్రిమిసంహారక మందు మొదలైనవాటివల్ల ఆరోగ్యం విపరీతంగా క్షీణించటమే కాకుండా మరణానికి కూడా దారితీస్తుంది. పొగపీల్చటంవల్ల గాలిపీల్చే గొట్టాలకి కెమికల్స్ అంటుకుపోయి ఆయాసం, ఉబ్బసానికి దారి తీస్తాయి.  రక్తప్రసరణకి ఆటంకం ఏర్పడటమే కాకుండా ప్రాణవాయువు సరిగా అందకుండా చేస్తుందిట ఈ సిగరెట్.

 

మన దేశంలో 60 లక్షల మంది శ్రామికులు ఈ పొగాకు ఉత్పత్తులు సాగు చేస్తున్నారు. ఒకేసారి ఈ ఉత్పత్తుల మీద నిషేదాలు విధించకుండా, వాళ్లకి వేరే ఉపాధి అవకాశాలు చూపించి ఈ పొగాకు ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పొతే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా భారత్ లో సిగరెట్ రేటు 10% పెంచితే వాటి వాడకం నలుగు నుంచి ఐదు శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  

 

 

ఈ ధూమపానం అలవాటుకి దూరమవ్వాలనుకునేవారు ఎప్పుడైనా పొగ తాగాలనిపిస్తే నీరు ఎక్కువగా తాగటం వల్ల ఆ కోరిక తగ్గుముఖం పడుతుందిట. అలాగే పొగ తాగాలనిపించిన వెంటనే ఆ మూడ్ లోంచి బయటకి రావటానికి వాకింగ్ కి వెళ్ళటమో లేదా చూయింగ్ గమ్ లాంటిది అలవాటు చేసుకోవటమో చెయ్యాలి. అంతేకాక మెడికల్ షాపుల్లో కూడా వీటికి తగ్గ మందులు దొరుకుతున్నాయి.

 

ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చెయ్యకూడదని ఎన్నో రకాల ఆంక్షలు విధించినా ప్రజలలో సరైన అవగాహన లోపించటంతో ఆ చట్టాలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రజలలో చైతన్యం వచ్చిన రోజు ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. 

..కళ్యాణి