కృష్ణాజిల్లాలో ఓ గ్రామాన్ని వెలివేసిన ప్రజలు

 

అప్పట్లో గ్రామాలను వెలివేయడం, గ్రామాల్లోని ప్రజలను వెలివేయడం అంటూ విన్నాం. ఇంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ వెలివేయడం అనే పదం వినిపిస్తుండటం దారుణం. కృష్ణాజిల్లా కోడూరు మండలం చింతకోళ్ల గ్రామం అంతటా స్వైన్ ఫ్లూ వ్యాపించిందంటూ పుకార్లు వచ్చాయి. దీంతో సమీప గ్రామ ప్రజలు చింతకోళ్ల వాసులతో మాట్లాడటం మానేశారు. అంతే కాదు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన మాష్టార్లు కూడా వారిని దూరం పెట్టారు. చింతకోళ్ల గ్రామానికి స్కూల్ బస్సులు రావని, కొన్నిరోజుల వరకు స్కూల్ కి రావొద్దంటూ విద్యార్థులకు అనధికార సెలవులు కూడా ప్రకటించారు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్. ఇంతేనా.. గ్రామానికి పాలు పోయడానికి వచ్చేవారు పాల సరఫరా నిలిపేశారు. టిఫిన్ చేద్దామని హోటల్ కి వెళ్తే హోటల్ కి రావొద్దంటూ బయటికి పంపేస్తున్నారు. మంచినీటి కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపాకల గ్రామానికి వెళ్తుంటే మా గ్రామానికి రావొద్దంటూ గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. ఆఖరికి ఆర్టీసీ బస్సుల్లో కూడా చింతకోళ్ల గ్రామ ప్రజలు దిగిపోవాలని తోటి ప్రయాణికులు గొడవ చేస్తున్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యనే బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. ఒకవేళ ఆ గ్రామంలో నిజంగా వ్యాధి వ్యాపిస్తే వారికి అవగాహన కల్గించి అండగా ఉండాలి కానీ ఇలా వెలివేయడం ఏంటి?. ఇలాంటివి చూసినప్పుడే ఈ సమాజం ఎటు వెళ్తుందా అని బాధ కలుగుతుంది.