టీఆర్ఎస్‌లో గడబిడ మొదలవుతుంది

 

తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం తమదే అని అంటున్నారు.. ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలని చూస్తున్నారు.. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం అంత సులభం కాదంటూ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు..  ఆ మధ్య కేసీఆర్ హడావుడి చేసిన ఫెడరల్ ఫ్రంట్  ఎక్కడ అంటూ ప్రశ్నించారు.. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే మరోవైపు బీజేపీతో కలిసి రహస్య దోస్తీ చేస్తున్నట్లుగా ఆరోపించారు.. కేసీఆర్ ఏ పథకాన్ని స్టార్ట్ చేసినా అది ఫెయిల్ అవుతుందన్నారు.. 

తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించింది తానేనని చెప్పిన జైపాల్ రెడ్డి, తెలంగాణలో ఆట స్టార్ట్ చేసింది కేసీఆరే అయినప్పటికీ గోల్ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.. అలానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గురించి వస్తున్న విమర్శలపై కూడా జైపాల్ రెడ్డి స్పందించారు.. జాతీయ పార్టీగా కాంగ్రెస్లో విభేదాలు సహజమేనని, ఎన్నికల్లో మాత్రం తామంతా ఒక్కటై టీఆర్ఎస్ పని పడతామన్నారు..

కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కేసీఆరే ఎక్కువగా ఇబ్బంది పడతారన్నారు.. కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చిన తర్వాత కలిసి ముందుకు వెళతామని, టీఆర్ఎస్ లో మాత్రం టికెట్లు ఇచ్చిన తర్వాతే గడబిడ మొదలవుతుందన్నారు.. సిట్టింగులకు టికెట్లు ఇస్తే ప్రజలు ఓడిస్తారని, వేరేవారికి టికెట్లు ఇస్తే సిట్టింగులు ఓడిస్తారని జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.