రాకోయీ... అనుకున్న అతిథీ!!

 

 

 

ఏదైనా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ వస్తే ఆ సంస్థకి ఎంత గౌరవం? అయితే రాష్ట్ర గవర్నర్ వస్తానన్నా రావొద్దనే సంస్థ ఉంటుందా? ఉంటుంది.. గవర్నర్ని రావొద్దన్న ఆ సంస్థ పేరు డెలోయిట్. రాకోయీ... అనుకున్న అతిథీ అనిపించుకున్న ఆ గవర్నర్ మరెవరో కాదు.. మన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్.

 

అసలింతకీ జరిగిందేంటంటే, మల్టీనేషన్ కంపెనీ డెలోయిట్ హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో తమ సంస్థకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు రాజ్‌భవన్‌కి వెళ్ళ గవర్నర్ని తమ కార్యక్రమానికి ఆహ్వానించారు. నరసింహన్ గారు పెద్దమనసు చేసుకుని సరే వస్తానన్నారు. డెలోయిట్ సంస్థ ప్రతినిథులు సంతోషంగా వెళ్ళిపోయారు. యథాప్రకారం గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని ఇన్విటేషన్లలో కూడా వేసేశారు. ఆ తర్వాత షరామామూలుగానే రాజ్‌భవన్ అధికారులు గవర్నర్ గారు పాల్గొనే ఫంక్షన్లో  ఏమేం జరగాలో, ఏమేం జరక్కూడదో తెలిపే ప్రొటోకాల్ షీట్ డెలోయిట్ ప్రతినిధులకు ఇచ్చారు. 


గవర్నర్ పాల్గొనే కార్యక్రమంలో రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించడం అనేది ప్రొటోకాల్. గవర్నర్ గారు సదరు కార్యక్రమంలో 45 నిమిషాలు మాత్రమే  ఉంటారని, గవర్నర్ గారు వచ్చేసరికి అప్పుడు జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆపేయాలని, ఆయన రాగానే ఒకసారి, వెళ్ళబోయేముందు ఒకసారి.. మొత్తం రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించాలని ప్రొటోకాల్ అధికారులు చెప్పారు. అయితే తమ కార్యక్రమంలో జాతీయగీతాన్ని ఒకసారి మాత్రమే వినిపిస్తామని, రెండోసారి మాత్రం తమవల్ల కాదని డెలోయిట్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.


అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చే తమ గెస్ట్‌లకి ఈ తతంగమంతా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అన్నారు. అయితే గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు మాత్రం జాతీయ గీతాన్ని రెండుసార్లు వినిపించాల్సిందేనని పట్టుపట్టారు. దాంతో మా సంస్థ కార్యక్రమాన్ని గవర్నర్ గారు లేకుండానే జరుపుకుంటామని, గవర్నర్ గారు రావాల్సిన అవసరం లేదని డెలోయిట్ ప్రతినిధులు చెప్పేశారు. అలాగే జరిపేశారు. ఈ ధోరణి చూసి రాజ్‌భవన్ అధికారులు అవాక్కయిపోయారు. అయినా గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. విదేశీ సంస్థలకి మన జాతీయగీతం విలువ, గవర్నర్ పదవికి వున్న గౌరవం ఏం తెలుస్తుందనీ?! అసలు రహస్యం ఏమిటంటే,  డెలోయిట్ సంస్థ బ్రిటీషోళ్ళది. వాళ్ళకి మన జాతీయగీతమంటే సహజంగానే నచ్చదు. అంతేగా?!