సీబీఐని కట్టడి చేసిన చంద్రబాబు

 

కేంద్రంలో సీబీఐ వివాదం దూమారం రేపిన సంగతి తెలిసిందే.దీంతో సీబీఐకి ఆంధ్ర ప్రదేశ్ లో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు.తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది.ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది.