అన్నవరం దేవస్థానంలో కలకలం.. 50 మందికి కరోనా

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో కరోనా కలకలం రేపుతోంది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 50 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. కరోనా సోకినవారిలో అధికంగా వ్రత పురోహితులు, అర్చకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈవో త్రినాథ రావు దేవదాయశాఖ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ నెల 23 వరకు అన్నవరం ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

 

శుక్రవారం వరకు 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. శనివారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గని కారణంగా ఈ నెల 23 తేదీ వరకు భక్తులకు ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. స్వామి వారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.