జగన్ బదులు చంద్రబాబు అవిశ్వాసం పెడితే..?

ఆంధ్రప్రదేశ్‌కి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్న బాధతో ఎంపీలు చేసిన నిరసన కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి.. విభజన హామీల మీదుగా ప్రత్యేకహోదా దిశగా టీడీపీ-బీజేపీ చీలికలకు.. చివరకు ప్రధాని మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం వరకు వెళ్లింది. తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్ధతు ప్రకటించాలని... ఒకవేళ తెలుగుదేశమే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే తాము.. సహకరిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఇప్పుడు రాజకీయాలన్నీ.. అవిశ్వాసం అన్న మాట చుట్టూ తిరుగుతున్నాయి. ఇవాళ జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది.

 

దీనిపై స్పందించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవిశ్వాస తీర్మానానికి 54 మంది ఎంపీల మద్దతు కావాలని.. అయినా కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే.. రాష్ట్రప్రయోజనాలు నెరవేరుతాయా అంటూ ప్రశ్నించారు. దీనికంటే అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే మంచిదని సూచించారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒకవేళ రాష్ట్రం కోసం మోడీపై చంద్రబాబు అవిశ్వాసం పెడితే అంటూ సోషల్ మీడియాలో ఒక డిష్కసన్ నడుస్తోంది. ఇది జరిగే పని కాదు.. ఒకవేళ జరిగితే మాత్రం దానికి బీజేపీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందట. ప్రతిపక్షం నుంచి రావాల్సిన అవిశ్వాసం మిత్రపక్షం నుంచి ఎదురైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెలువడతాయి.

 

సమయం కోసం ఎదురుచూస్తోన్న దేశంలోని ఇతర రాజకీయ పక్షాలు కమలానికి ఎదురుతిరగడంతో పాటు.. ఆ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబుకు గుర్తింపు వస్తుందని... ఇప్పటికే మోడీని ఢీ కొట్టగల సత్తా ఉన్న నేత బాబేనని వివిధ పార్టీల అధినేతలు అంచనా వేస్తున్న పరిస్థితుల్లో.. బీజేపీయేతర పక్షాలన్నీ తెలుగుదేశంతో కలిసి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే పరిస్థితి అంతవరకు వస్తే చంద్రబాబును ఆపడం అసాధ్యమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అక్కడిదాకా తెచ్చుకోకుండా బాబును శాంతింపజేసేందుకు సిద్ధమవుతున్నారట. సీనియర్ నేతలను రంగంలోకి దించాలని వారి మాట టీడీపీ అధినేత వినిపించుకోని పక్షంలో.. ఆయనకు అత్యంత ఆప్తుడైన వెంకయ్యనాయుడు ద్వారా చంద్రబాబును కూల్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.