దేశం దూసుకుపోతోంది! కాంగ్రెస్ మాత్రం అక్కడే ఆగిపోయింది! 

గత రెండు, మూడు రోజుల్లో జాతీయ వార్తల్ని గమనించే వారందరి కళ్లు రెండు మూడు ప్రధానమైన వార్తలపై పడ్డాయి. వాటిలో మొదటిది మన దేశం ఫ్రాన్స్ ను అధిగమించింది! దేంట్లో? ఆరో అతి పెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు ఫ్రాన్స్ ను దాటేసింది! ఇది చిన్న సక్సెస్ ఏం కాదు. అలాగని మరీ జబ్బలు చరచుకోవాల్సింది కూడా! ఇక రెండోది, స్టాక్ట్ మార్కెట్లు ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోతున్నాయి. మరోమారు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్, నేషనల్ ఎక్స్ ఛేంజ్ రెండూ ఆల్ టైం హైని టచ్ చేశాయి. ఇది కూడా ఒక కోణంలో సంతోషించాల్సిన విషయమే! ఎందుకంటే, ప్రపంచ పటంలో పెరుగుతోన్న మన ప్రాధాన్యతకి ఇలాంటివే నిదర్శనాలు! ఇప్పుడిక మూడో వార్తకొద్దాం! కాంగ్రెస్ లోని మేధావి నేత శశిథరూర్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో జోస్యం చెప్పారు! 2019లోనూ మోదీయే పీఎం అయితే భారత్ హిందూ పాకిస్తాన్ గా మారిపోతుందట!

 

 

భారత్ ఫ్రాన్స్ ను అధిగమించటం, సెన్సెక్స్ దూసుకుపోవటం, శశిథరూర్ మాటలు… వీటి మధ్య పైకి ఎలాంటి సంబంధం కనిపించకపోవచ్చు! కానీ, అంతర్గతంగా పెద్ద లింకే వుంది! అదేంటంటే… మోదీ చేసే పనులు చాలా మందికి నచ్చకపోవచ్చు. అలాగే, డీమానిటైజేషన్ లాంటి వాటి వల్ల సామాన్య జనం ఇబ్బంది కూడా పడి వుండవచ్చు. అయినా, భారత ఆర్దిక రంగం ప్రపంచాన్ని విస్మయపరిచేలా దూసుకుపోతోంది. కామన్ ఇండియన్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ క్రమంగా పెరుగుతోంది. నిజంగా అద్భుతమైన లాభాల్ని సామాన్యులు చవిచూడటం లేదు. అయినప్పటికీ జరుగుతున్న అభివృద్ధి కూడా కాదనలేనిదే! రానున్న రోజుల్లో బీజేపీ జనం ముందుకు ఈ విజయాల్నే తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో విదేశాంగ విధానం, ఆర్దిక సంస్కరణల విషయంలో మోదీ గొప్ప విజయాలు సాధించాడని ఆ పార్టీ వారు చెప్పుకుంటారు! అందరూ కాకున్నా ఒక వర్గం ఓటర్లు వారి వాదనతో ఏకీభవించవచ్చు! మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది?

 

 

మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు తమకు అవసరం అనుకుంటే హిందూత్వ ఎజెండా ఎత్తుకుంటారు. లేదంటే అభివృద్ధి జపం చేస్తారు. ఆ రెండు విషయాల్లో వారి చిత్తశుద్ధి ఎలావున్నా అవసరానికి ఏది వాడాలో కమలనాథులకి బాగా తెలుసు. కానీ, ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ మాత్రం సెక్యులర్ వ్యామోహంలో ఎంతకీ ముందుకు సాగటం లేదు! శశిథరూర్ హిందూ పాకిస్థాన్ వ్యాఖ్య అందుకు నిదర్శనం! ఒకప్పుడు మోదీ వస్తే ముస్లిమ్ లు బతకలేరని ప్రచారం చేసిన కాంగ్రెస్ వారు ఇప్పుడు మళ్లీ మోదీ వస్తే హిందూ పాకిస్తాన్ అంటున్నారు! ఇది కొంత మంది మైనార్టీలకు బావుంటుందేమో కానీ… లాజిక్ వాడే ఏ మైనార్టీకి, హిందువుకి కూడా నచ్చదు. బీజేపీ మీద , మోదీ మీద వున్న అక్కసు కాంగ్రెస్ నేతలు హిందూత్వం మీద కక్కటం దుష్పలితాలు ఇస్తుంది. గతంలో ఇలాగే హిందూ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు చేతులు కాల్చుకున్నారు!

మోదీ దేశదేశాలు తిరుగుతుంటే ఆయన విదేశాంగ విధానం గురించి కాక ఆయన సూటు, బూట్ల గురించి విమర్శింటం, ఒకపక్క ఆర్దికంగా దేశం పురోభివృద్ధి సాధిస్తుంటే ఇంకా సెక్యులర్ రాజకీయ కామెంట్లు చేయటం… కాంగ్రెస్ ఇదే మూసలో వుండిపోతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మీద అదే పాత కాలపు మతోన్మాద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయి. మోదీకి శ్రీరామ రక్షగా మారుతోంది ఇదే! వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవటం మరీ అంత సులువు కాదు. అయినా మోదీ, షా దైర్యంగా వుంటున్నారంటే… ప్రతిపక్షాలు చేస్తోన్న పొరబాటే! యంగ్ ఇండియన్స్ ఏం కావాలనుకుంటున్నారో బీజేపీ గుర్తించింది. అవి ఇచ్చినా ఇవ్వకున్నా మాటల మాయాజాలం అన్నా చేస్తోంది. కాంగ్రెస్ , కొన్ని ఇతర సెక్యులర్ పార్టీలు అది కూడా చేయటం లేదు. ఎంతసేపు హిందూత్వం గురించి, లేనిపోని, కానిపోని హిందూత్వ ఉగ్రవాదం, మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాయి. అందుకే, బీజేపీని వద్దనుకునే వారు కూడా కాంగ్రెస్ ని ముద్దనుకోవటం లేదు!

 

 

భారతదేశంలోని ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్ ని ప్రధానిని చేయాలని తాపత్రయపడుతోన్న కాంగ్రెస్… బీజేపీని, మోదీని నియంత్రించాలంటే… ముందు హిందూ వ్యతిరేక భావజాలానికి స్వస్తి పలకాలి. అలాగే, దేశంలో పోగవుతన్న లక్షల కోట్ల సంపద ఎందుకు సామాన్యుల దాకా రావటం లేదో గుర్తించి… ఆ లొసుగుల్ని ఎత్తి చూపాలి. ఇలా సామాన్యుల సమస్యలు మాట్లాడితేనే మోదీ కార్నర్ అయ్యేది. లేదంటే 2019లోనూ ఓటర్లు అనివార్యంగా ఆయన వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు!