బీజేపీతో నితీష్ కుమార్ కటీఫ్?

 

దేశంలో ప్రతిపక్ష పార్టీలలో నరేంద్ర మోడీ తరువాత అంతటి పేరు సంపాదించుకొన్న వ్యక్తి ఎవరంటే, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని చెప్పవచ్చును. వీరిద్దరూ కూడా తమ తమ రాష్ట్రాలను ప్రగతి పధంలో తీసుకు వెళ్లేందుకు చేస్తున్న కృషి కారణంగానే సుప్రసిద్దులయ్యారని చెప్పవచ్చును.

 

అయితే, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నాయకత్వంలో అన్నివిధాల బ్రష్టు పట్టిన బీహార్ రాష్ట్రాన్ని చక్కదిద్దడం సాధారణ విషయం ఏమి కాదు గనుక, వీరిద్దరిలో నితీష్ కుమార్ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. గనుక తన రాష్ట్రం త్వరితగతిన ప్రగతి సాధించాలంటే బీహార్ కు ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ అవసరమని ఆయన వాదన. తన వాదనను మరింత బలంగా వినిపించేందుకు ఆదివారం నాడు డిల్లీలో లక్షమందితో ఆయన అధికార ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే, తన డిమాండ్ సాధనకు ఆయన ఎంచుకొన్న మార్గం, ఆయనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా లేక బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యుపీయే కూటమిలో చేరెందుకా? అనే సందేహం తలఎత్తేలా చేస్తోంది.

 

అయన ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తన రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమయితే కూటములకు అతీతంగా ఏ ప్రభుత్వానికయినా మద్దతు ఇచ్చేందుకు తానూ సిద్ధం అని ప్రకటించడం గమనిస్తే ఆయన యుపీయే కూటమిలో చేరేందుకు సిద్ధం అని కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు పంపినట్లు అర్ధం అవుతోంది. ఆయన తన ర్యాలీకి బీజేపీని ఆహ్వానించకపోవడం, అభివృద్ధి అంటే ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిగత సంస్థగా మార్చడం కాదని గుజరాత్ ముఖ్యమంత్రి మోడీపై పరోక్షంగా విమర్శలు చేయడం కూడా అదే సూచిస్తోంది.

 

నితీష్ కుమార్ ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపటికీ, ఆయన వ్యతిరేఖిస్తున్న నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదించడమే ఆయనను ఎన్డీయే నుండి బయటకి వెళ్లేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును. అంతేకాక మరో బలమయిన కారణం కూడా ఉంది. నితీష్ కుమార్ తానూ ప్రధాని పదవికి అనర్హుడిని స్వయంగా చెప్పుకొంటున్నపటికీ, ఒకవేళ బీజేపీలో అంతర్గత పోటీ గనుక ఏర్పడినట్లయితే, అప్పుడు అందరికీ ఆమోద యోగ్యుడయినా వ్యక్తిగా తానూ ఆ పదవిని దక్కించుకోవచ్చుననే ఆలోచన ఆయనకుందనేది బహిరంగ రహస్యమే.

 

అయితే, బీజేపీ అనూహ్యంగా మోడీని ముందుకు తీసుకు రావడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అందువల్లే ఆయన నరేంద్ర మోడీ ప్రధాని పదవికి అభ్యర్ధిత్వాన్ని మొదట నుండి వ్యతిరేఖిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 2002 సం.లో మోడీ అధ్వర్యంలో జరిగిన మారణఖాండ కూడా ఆయనను వ్యతిరేఖించడానికి మరో కారణంగా చెప్పవచ్చును.

 

ఒకవేళ బీజేపీ మోడీని కాకుండా మరొకరిని ఎవరినయినా తన ప్రదాని అభ్యర్ధిగా ప్రతిపాదించి ఉంటే బహుశః ఆయన ఎన్డీయే కూటమిని వీడే ఆలోచన చేసేవారు కారేమో. అయితే, 2014సం.ల ఎన్నికలలో ఎలాగయినా సరే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, దేశవ్యాప్తంగా కాకపోయినా ఉత్తరాది రాష్ట్రాలలో మంచి సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించిన నరేంద్ర మోడీని కాదనుకొని వేరొకరిని తన రధసారధిగా చేసుకొని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కనుక మోడీనే తమ ప్రధాని అభ్యర్దని దాదాపు ఖాయం చేసుకోవడంతో నితీష్ కుమార్ కు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పలేదు.

 

బీజేపీ కూడా నితీష్ కుమార్ తమ కూటమి నుండి బయటకి వెళ్లిపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలో ఆయనకి వ్యతిరేఖంగా పోటీకి సిద్ధం అని ప్రకటించడంతో, ఇక వారిరువురు మద్య ‘శాస్త్రోక్తంగా విడాకులు’ తీసుకోవడమొకటే మిగిలి పోయిందని చెప్పవచ్చును.

 

అయితే, నితీష్ కుమార్ ఎన్డీయేను వీడి యుపీయే ‘హస్తం’ గనుక అందుకొంటే ఇక ఆయన జీవిత కాలంలో దేశానికి ప్రధాని అయ్యే ఆలోచన కూడా మానుకోవచ్చును. ఎందుకంటే యుపీయేలో ఆ పదవి శాశ్వితంగా సోనియా గాంధీ కుటుంబానికే రిజర్వు చేయబడింది గనుక. అందువల్ల నితీష్ కుమార్ కేవలం తన రాష్ట్ర ప్రగతిని మాత్రమే గనుక కోరుకొంటే నిరభ్యంతరంగా ఆయన యుపీయే హస్తం అందుకోవచ్చును. కానీ, ప్రధాని పదవిపై ఆశలుంటే మాత్రం ఆయన ఎన్డీయే కూటమికే అంటిపెట్టుకొని ఉండటం మేలు. తద్వారా ఇవాళ్ళ కాకపోయినా రేపయినా ఆయనకు ఆ అవకాశం దక్కవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, ఎన్డీయే కూటమిని వీడటం వలన నితీష్ కుమార్ కు కొత్తగా వచ్చే నష్టం లేకపోయినప్పటికీ, అటువంటి సమర్ధుడు ప్రజాకర్షక నాయకుడినీ, ఆయన పార్టీ మద్దతునీ కోల్పోవడం ఎన్డీయే కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకె తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును.