నిరుద్యోగభృతి… ఎన్నికల ముందు లోకేష్ మోహరించిన మిసైల్!

ఎన్నికల ముందు సంవత్సరం ఏ ప్రభుత్వమైనా ప్రజల్ని మెప్పించే పథకాలు విరివిగా అమలు చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అయితే, వాటి లక్ష్యం ఓట్లు మాత్రమే అయి వుంటాయి. చాలా వరకూ పాలకుల వరస ఇలాగే వుంటుంది. కానీ, ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిరుద్యోగభృతిని అలా చూడలేం. వైసీపీ దీన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేయవచ్చుగాని… నిరుద్యోగభృతి నిస్సందేహంగా గొప్ప పథకమే. ఎందుకంటే, నెలకు వెయ్యి రూపాయలు అందుకునే 22 నుంచీ 35 ఏళ్ల మధ్య వయస్సులోని నిరుద్యోగ యువత దాన్ని ఎంతో సమర్థంగా వాడుకోగలుగుతారు. వారి అవసరాలన్నీ ఆ డబ్బుతో తీరిపోతాయని ప్రభుత్వం కూడా ఎక్కడా చెప్పటం లేదు. కానీ, నిరుద్యోగ యువత చేసే ఉద్యోగాన్వేషణలో అవి చక్కగా ఉపయోగపడతాయి.

 

 

నిరుద్యోగ భృతి ఐడియా గత ఎన్నికల కాలం నాటిదే. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే, ఇంత కాలం దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు హడావిడిగా తీసుకొస్తున్నారా అంటే… సూటి సమాధానం అంటూ వుండదు. ఎందుకంటే, నవ్యాంధ్ర రాష్ట్రానికి తొలి సీఎంగా చంద్రబాబు గత నాలుగేళ్లలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటన్నటి మధ్యా నిరుద్యోగభృతి ఆలస్యమైతే అయి వుండవచ్చు. కానీ, నిరుద్యోగభృతి అందించాలన్న ఆయన చిత్తశుద్ధిని మనం శంకించలేం. అలాగే, యువ నేత లోకేష్ దీనిపై చూపిన పట్టుదల కూడా మెచ్చుకుని తీరాల్సిందే!

 

 

నిరుద్యోగభృతి పథకానికి యువనేస్తం అన్న పేరు సూచించారట లోకేష్. ఈ పథకంపై పూర్తి స్థాయిలో కూలంకషంగా అధ్యయనం చేసింది ఆయనే. మొదటి నుంచీ దీని సాధ్యాసాద్యాలు ఆలోచించి పకడ్బందీగా ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ పథకం వల్ల మొత్తం 12 లక్షల మంది యువత లాభపడనున్నారు. ఇంతటి భారీ పథకానికి యువ నేస్తం అన్న పేరు సరిగ్గా సరిపోతుంది. అయితే, చంద్రబాబు యువనేస్తం అంటూ నామకరణం చేద్దామని మంత్రులు అభ్యర్థించినా సీఎం వద్దన్నారట. ఈ పథకం క్రెడిట్ అంతా లోకేష్ దేనని బాబు చెప్పారట కూడా!

 

చంద్రబాబు, లోకేష్ లలో ఎవరికి నిరుద్యోగభృతి క్రెడిట్ దక్కినా అదేం పెద్ద ముఖ్యం కాదు. అంతిమంగా టీడీపీకి లాభం చేకూరితే కార్యకర్తలకి అదే సంతోషం! కానీ, ఇంతకీ ఈ నిరుద్యోగభృతి వల్ల లోకేష్ ఆశిస్తున్న రాజకీయ లబ్ది ఏంటి? యువతలో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవటమే! ఒకవైపు రాజధాని కూడా లేని కొత్త రాష్ట్రం, మరో వైపు కేంద్రం సృష్టిస్తోన్న అడ్డంకులు, ఇంకో వైపు బాద్యత లేని ప్రతిపక్షాల కుట్ర రాజకీయం… ఇన్నిటి మధ్యా అనుకున్నని ఉద్యోగాలు కల్పించలేకపోవటం సహజమే! అయినా కూడా ఓటు వేసి అధికారం అందించిన జనం పట్ల తమ బాద్యతని నిరూపించుకోవటమే నిరద్యోగభృతి లక్ష్యం. అయితే, నిరుద్యోగభృతికి ఓకే చెప్పిన సమావేశంలోనే ఏపీ కేబినేట్ 20 వేల ఉద్యోగాల భర్తీకి కూడా పచ్చజెండా ఊపటం మనం జాగ్రత్తగా గుర్తించాలి! ఉద్యోగాల కల్పన సాగుతూనే వుంటుంది. అంతవరకూ నిరుద్యోగులకి ఉపశమనం కోసమే … ఈ నిరుద్యోగభృతి!