రాక్షసుల్ని ఉరి తీయాలి… రాక్షసత్వాన్ని గురి పెట్టాలి!

 

నిర్భయ… ఈ పేరు ఒక మామూలు శబ్దం కాదు. స్వతంత్ర భారతంలో దశాబ్దాలు రాజ్యమేలిన నిశ్శబ్ధానికి చరమగీతం! అనాదిగా స్త్రీలపై దౌర్జన్యం , అమానుషం జరుగుతూ వస్తూనే వున్నా ప్రజాస్వామ్య యుగంలో, స్వతంత్ర భారత వ్యవస్థలో తగ్గు ముఖం పట్టాలి. కానీ, అలా జరగలేదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో మహిళల స్థితి దయనీయంగా మారిపోయింది. అది దేశం గుండెల్లో రగలి రగలి పెను దావాణలమై దిల్లీని కమ్మేసింది నిర్భయ విషాదం తరువాత. చివరకు, అయిదేళ్ల నిరీక్షణ అనంతరం ఉరే సరి అన్న తీర్పుతో కొంత వరకూ న్యాయానికి న్యాయం చేస్తూ ముగింపుకొచ్చింది!

 

నిర్భయ ఉదంతం మనలో అందరికీ తెలిసిందే. దేశాన్ని కుదిపేసిన ఆ రేప్ సంఘటన ప్రపంచానికి, చరిత్రకి ఒక పెద్ద విషాదకమరైన మలుపు కావచ్చు. కాని, నిజంగా, నిజాయితీగా మాట్లాడుకుంటే… భారతదేశంలో నిత్యం ఎందరో నిర్భయలు. వారందరి ఆర్తనాదాలు రాజధాని వీధుల్లో నినాదాలై మార్మోగవు. ఊళ్లలోని పాకల్లో, పట్టణల్లోని గుడిసెల్లో,నగరాల్లోని బంగాళ్లాల్లో కామాంధుల కసి పిడికిళ్లలో ఆ గొంతుకలు పూడుకుపోతాయి. మన దేశంలో లెక్కకు మించి రేప్ కేసులు పోలీస్ స్టేషన్ దాకా రానే రావు. వచ్చిన కోర్టు దాకా వెళ్లవు. వెళ్లినా న్యాయమనే ఉపశమన గమ్యాన్ని చేరవు. నిర్భయ దారుణం తరువాత ములాయం లాంటి ఒక సీనియర్ జాతీయ నేత ఏమన్నారో గుర్తే కదా? మగపిల్లలన్నాక తప్పులు జరుగుతుంటాయి. అది సహజం అన్నాడు! అలా అత్యాచారాన్ని సహజంగా తీసుకునే అమానుష సమాజం మన చుట్టూ ఇంకా అలానే వుంది!

 

నిర్భయ ఉదంతం తరువాత నిర్భయ చట్టం వచ్చింది. దాని అమలు ఎలా వుందో రోజూ మనం చూసే అత్యాచారా వార్తలతోనే తెలసిపోతుంది. ఎంతటి కఠినమైన చట్టమైనా మన దేశంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం తీసుకునే అంతి తీర్పు వద్దకొస్తుంది. నిర్భయ నిందితులకే ఉరి శిక్ష వేయటానికి ఏళ్లు పట్టింది. ఇక మీడియా, సామాన్య జనం ఒత్తిడి లేని ఇతర మామూలు రేప్ కేస్ ల సంగతేంటి? న్యాయం దక్కినా… అది దశాబ్దాల అనంతరం వచ్చేదే తప్ప తక్షణం అమలయ్యే సూచనలే లేవు! అందుకే, జనం కూడా రేపిస్టులు మొదలు ఉగ్రవాదుల దాకా నేరం చేసిన వాడ్ని పోలీసులు, సైనికులు ఎన్ కౌంటర్ చేయాలనే కోరుకుంటున్నారు దేశంలో! చట్టబద్ధంగా విచారణ జరపటం అంటే ఇక్కడ బిర్యానీలు పెట్టి రాచమర్యాదలు చేయటమే! నిర్భయ చట్టం లాంటివి తేవటం కంటే ముందు మన న్యాయ వ్యవస్థ తాబేలు నడకని సింహం వేటలాగా మార్చే ప్రయత్నాలు చేయాలి. అది చాలా ముఖ్యం!

 

నిర్భయ కేసులో ఉరిశిక్షలు పడటం అందర్ని సంతృప్తి పరిచి వుండవచ్చు. కానీ, మన దేశ న్యాయవ్యవస్థ దుర్భలత్వం కూడా ఇదే కేసుతో బయటపడింది. నిర్భయ స్వయంగా ఇచ్చిన వాంగ్మూలంలో తన శరీరంలోకి రాడ్డుని దింపి నరకం చూపించాడని చెప్పిన వాడు ఇవాళ్ల స్వేచ్ఛగా సభ్య సమాజంలో కలిసిపోయాడు! కారణం ఆ కరుడు కట్టిన కామాంధుడు మెజార్టీ నిండటానికి ఇంకా కొన్ని నెలలు తక్కువగా వుండటమే! అయినా… అసలు ఒక స్త్రీని రేప్ చేయాలని తెలిసిన వాడు బాలుడెలా అవుతాడు? అత్యాచారం చేయటమే కాకుండా ఆమె మరణానికి కారణమయ్యేలా రాక్షసంగా హింసించిన వాడు మనిషెలా అవుతాడు? కాని, మన చట్టాలు, వాటిలోని లోపాలు సదరు బాల పిశాచానికి ఉరిని తప్పించేశాయి. కనీసం జైలు జీవితం కూడా లేకుండా స్వేచ్ఛగా రోడ్డు మీద వదిలేశాయి!

 

నిర్భయ అసలు రేపిస్టు తప్పించుకున్నాక చట్టంలో మార్పు తీసుకొచ్చి పద్దెనిమిది నుంచీ పదహారుకు తగ్గించినా… జరిగిన నష్టం మాత్రం పూడ్చలేనిది. అసలు వాడ్ని వదిలేసి మిగతా వారికి ఉరి వేయటం సంపూర్ణ న్యాయం ఏనాటికీ కాదు. కనీసం ముందు ముందు అయినా చట్టం అమలు పటిష్టంగా వుండి నేరం చేసిన వాడు తప్పించుకునే అవకాశాలు లేకుండా చేయాలి. అదీ రేప్ లాంటి అమానుష నేరాలకి శిక్షలు వేసే విషయంలో లోపాలకి ఎంత మాత్రం వీలుండకూడదు!

 

నిర్భయ రేప్ కేసు కేవలం చట్టాలు, న్యాయ వ్యవస్థ వంటి అంశాలకు మాత్రమే సంబంధించింది కాదు. మన దేశంలో స్త్రీని ఆదిపరాశక్తి అంటూ గుళ్లు కట్టి పూజిస్తారు. అటువంటి భక్తుల మధ్యలోనే ఎలా రేప్ లు చేసే రాక్షసులు పుట్టుకొస్తున్నారు? కారణం… రోజు రోజుకి పడిపోతన్న నైతిక విలువలు! టీవీలో, సినిమాల్లో, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లలో,ఇంటర్నెట్ లో … ఎక్కడా స్త్రీని శృంగార భావంతో తప్ప మరోలా చూపించటం లేదు. స్కూళ్లు, కాలేజీల్లో మార్కుల వేట తప్ప నీతి చెప్పే తీరిక లేదు. అందుకే, స్త్రీని అమ్మగా భావించిన సంస్కృతిలోని వారే ఇవాళ్ల బొమ్మగా చూస్తున్నారు. రేప్ లు, లైంగిక దాడుల వంటివి పెరిగిపోవటానికి కారణం అవుతున్నారు. కాబట్టి, సమాజంలోని స్త్రీ నిర్భయలా బాధితురాలు కాకుండా నిర్భయంగా వుండాలంటే… కావాల్సింది కొత్త చట్టాలు కాదు. మారాల్సింది మనం…