జగన్ పై దాడి కేసులో వైసీపీ నేతలను విచారిస్తున్న ఎన్‌ఐఏ

 

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.విజయప్రసాద్‌ను సీతమ్మధారలోని ఆయన ఇంటి వద్ద ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విజయప్రసాద్‌తో పాటు వైసీపీకి  చెందిన పలువురు నేతలు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అక్కడికి చేరుకొని విచారిస్తున్నారు. జగన్‌పై దాడి సమయంలో ఆయన వెంట ఎయిర్‌పోర్టులో విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జియ్యాని శ్రీధర్‌,బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, పీడిక రాజన్నదొర, తైనాల విజయ్‌ ఉన్నారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు వీరిని విచారిస్తున్నారు. ప్రధానంగా.. దాడి ఘటన ఏ సమయానికి, ఎలా జరిగింది? ఆ సమయంలో విమానాశ్రయంలో ఎవరెవరు ఉన్నారు? నిందితుడు దాడిచేసినప్పుడు  అక్కడ నెలకొన్న పరిస్థితేంటి? ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ జరిగిన పరిణామాలేంటి? తదితర అంశాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.